Manchu Manoj: హనుమాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టే మొదటి రోజు 27 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. రెండవ రోజు కూడా ఎలాంటి డ్రాప్స్ లేకుండా, నూన్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలను నమోదు చేసుకుంది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటిరోజుకంటే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఇదే రేంజ్ ట్రెండ్ కొనసాగుతూ పోతే ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ద్వారా హీరో తేజ సజ్జ కి ఎంత మంచి పేరు వచ్చిందో, విలన్ గా చేసిన మంచు మనోజ్(Manchu Manoj) కి కూడా అంతే గొప్ప పేరు వచ్చింది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ సక్సెస్ మీట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ ‘చాలా కాలం అయ్యింది. ఇలా నా సినిమా సక్సెస్ మీట్ లో నిల్చొని మాట్లాడి. చాలా కాలం తర్వాత నా ఫోన్ మోతమోగుతుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు నా క్యారక్టర్ గురించి పొగుడుతుంటే నోటి నుండి మాటలు రావడం లేదు. ఇంత పెద్ద పాన్ ఇండియన్ సినిమాలో, నన్ను, తేజ సజ్జ ని నమ్మి ఈ చిత్రం లో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ కార్తీక్ గారికి, నిర్మాత విశ్వప్రసాద్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలోకి నన్ను తీసుకుంటున్నారు అనే వార్త వచ్చినప్పుడు చాలా మంది విశ్వప్రసాద్ గారికి వాడితో సినిమా ఎందుకు, 12 ఏళ్ళ తర్వాత వస్తున్నాడు, రిస్క్ అవసరమా అని ఆయనకు చెప్పి ఉండొచ్చు. కానీ ఎవ్వరి మాటలు వినకుండా విశ్వప్రసాద్ గారు ఈ సినిమాలోకి నన్ను తీసుకున్నారు. ఇక కార్తీక్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. నువ్వు నన్ను మాత్రమే కాదు బ్రదర్, నా కుటుంబాన్ని నిలబెట్టావు. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, చిన్నప్పటి నుండి నేను బ్రతికిన జీవితాన్ని నా బిడ్డలకు ఇవ్వగలనా అని, ఇవ్వగలను అనే నమ్మకాన్ని ఈ సినిమా ద్వారానే వచ్చింది. ఇక ఆడియన్స్ నాపై చూపించే ప్రేమకు నేను బానిసని. ఎక్కడికి వెళ్లినా నన్ను కం బ్యాక్ ఇవ్వమని, సినిమాలు చెయ్యమని అడుగుతూ ఉండేవారు. కచ్చితంగా చేస్తాను అని చెప్పుకొచ్చేవాడిని. చివరికి నా కెరీర్ కి అవసరమైన సినిమానే పడింది’ అంటూ మంచు మనోజ్ బాగా ఎమోషనల్ అవుతూ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
