Banned OTT Platforms: కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారింది. ఇదే సమయంలో ఓటీటీ ల హవా పెరిగింది.. దీంతో ఇంట్లో కూర్చుని సినిమాలు చూసేందుకే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ లోనే విడుదలవుతున్నాయి. ఇక థియేటర్లో విడుదలైన సినిమా ఖచ్చితంగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. దీనికి తోడు ఓటీటీ సంస్థలు వెబ్ సిరీస్ లు కూడా నిర్మిస్తున్నాయి. వాటిలో నటించేందుకు పెద్ద హీరోలు, హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. సమంత, ప్రియమణి, నాగచైతన్య, రానా, వెంకటేష్ వంటి వారు ఇప్పటికే వెబ్ సిరీస్ లలో నటించారు. ఓటీటీ లోనూ హవా ప్రదర్శిస్తున్నారు.. ఇక చిన్న సినిమాలకైతే ఓటీటీ బంగారు బాతు గుడ్డు లాగా మారింది.
ఓటీటీ వల్ల ప్రేక్షకులకు, పరిశ్రమలోకొన్కొత్తగా వచ్చే వారికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఓటీటీ సంస్థలు అశ్లీలతను ఎక్కువగా ప్రసారం చేస్తున్నాయి. దీనిపై ఎటువంటి సెన్సార్ లేకపోవడంతో… అసభ్య దృశ్యాలను ఎటువంటి అడ్డు లేకుండా ప్రదర్శిస్తున్నాయి. దీనిపై కేంద్రానికి ఫిర్యాదులు అందడంతో కీలక నిర్ణయం తీసుకుంది.. అసభ్యకరమైన కంటెంట్ ఉన్న 18 OTT ల పై నిషేధం విధించింది. ఇవి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా కంటెంట్ ప్రదర్శిస్తున్నాయని కేంద్రం అభియోగాలు మోపింది. అందుకే వాటిపై నిషేధం విధిస్తున్నట్టు వెల్లడించింది. కేవలం ఓటీటీలు మాత్రమే కాకుండా, 19 వెబ్సైట్లు, 10 యాప్ లపై కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000 లో నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఐటి శాఖ ప్రకటించింది.. సంబంధిత అధికారులు, మహిళా హక్కుల నిపుణులను సంప్రదించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. వీటిల్లో పది యాప్స్ వెంటనే బ్లాక్ చేయాలని ఐటీ శాఖ నిర్ణయించింది. ఈ పదిలో 7 గూగుల్ ప్లే, మూడు యాప్ స్టోర్ లో ఉన్నాయి.
నిషేధించిన ఓటీటీలు ఏంటంటే..
డ్రీమ్స్ ఫిలిమ్స్, వూవీ, యస్మా అన్ కట్ అడ్డా, ట్రై ప్లిక్స్, ఎక్స్ ప్రైమ్, హంటర్, రాబిట్ హంటర్, ఎక్స్ ట్రా మూడ్, న్యూ ప్లిక్స్, బేషారమ్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, మూడ్ ఎక్స్, మోజ్ ప్లిక్స్, హాట్ షాట్ వీఐపీ, ఫ్యుగీ, చికో ఫ్లిక్స్, ప్రైమ్ ప్లే లో అశ్లీల కంటెంట్ ఎక్కువగా ప్రచారం అవుతోందని కేంద్ర ఐటీ శాఖ చెబుతోంది. అందులో భాగంగానే వీటిని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది.