Sudeep: ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ మొదట హిందీ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ప్రారంభమైంది. అక్కడ భారీ హిట్ అవ్వడంతో, కొన్నాళ్ళకు బిగ్ బాస్ టీం కన్నడ లో కిచ్చా సుదీప్ ని హోస్ట్ గా పెట్టి బిగ్ బాస్ షో ని ప్రారంభించింది. ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది. వరుసగా 10 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, రీసెంట్ గానే 11వ సీజన్ ని ప్రారంభించుకుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో స్వర్గం – నరకం అనే కాన్సెప్ట్ ని కన్నడ బిగ్ బాస్ షో లో ప్రారంభించారు. హిందీ లో కూడా ఇది ఉంది, కానీ అక్కడ అంత నెగటివిటీ రాలేదు కానీ, ఈ కాన్సెప్ట్ పై కన్నడలో మాత్రం తీవ్రమైన నెగటివిటీ ఏర్పడింది. పోలీసులు రీసెంట్ గానే నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఈ నెగటివిటీ ని తట్టుకోలేకనో, లేకపోతే వేరే వ్యక్తిగత కారణాల వల్లనో తెలియదు కానీ, కిచ్చ సుదీప్ బిగ్ బాస్ షో నుండి తప్పుకుంటున్నట్టు రీసెంట్ గానే ఒక పోస్ట్ ని ట్విట్టర్ లో పెట్టాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘బిగ్ బాస్ షో పట్ల మీరు చూపించిన అత్యంత ఆదరణకు ధన్యవాదాలు. మీరందరు నాపై చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలు ఎలాంటివో, టీఆర్ఫీ రేటింగ్స్ ని చూస్తేనే అర్థం అవుతుంది. మీ ప్రేమకు నేను బానిసను. బిగ్ బాస్ తో నా ప్రయాణం ఇప్పటికీ పదేళ్లు పూర్తి అయ్యింది. ఈ ప్రయాణాన్ని అంత తేలికగా మర్చిపోలేను, ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించింది. ఇప్పుడియూ 11 వ సంవత్సరం కూడా బిగ్ బాస్ షోతో ప్రయాణిస్తున్నాను. కానీ నేను చేయాల్సిన పనులు చాలా మిగిలి ఉన్నాయి, దీంతో నా బిగ్ బాస్ ప్రయాణానికి ముగింపు పలుకుతున్నాను. ఇదే నా చివరి సీజన్. ఈ సీజన్ ఎంతో అద్భుతంగా ఉండేలా, మీరందరం చిరకాలం ఈ సీజన్ గుర్తించుకునేలా నేను చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు కిచ్చా సుదీప్.
ఆయన తీసుకున్న ఈ నిర్ణయం బిగ్ బాస్ టీం కి పెద్ద షాక్ అనే చెప్పాలి. కన్నడ సినీ పరిశ్రమలో ఉండే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలలో కిచ్చ సుదీప్ ఒకడు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇంతకు ముందు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కన్నడ వెర్షన్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. దురదృష్టం కొద్దీ ఆయన చనిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన జీవించి ఉండుంటే కచ్చితంగా బిగ్ బాస్ టీం ఆయనని సంప్రదించి ఉండేవారు. ఇక పునీత్, సుదీప్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో దర్శన్. ప్రస్తుతం ఈయన మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు. ఇక మిగిలింది కేజీఎఫ్ హీరో యాష్ మాత్రమే. ఆయన ఒప్పుకోకుంటే కన్నడలో తదుపరి బిగ్ బాస్ షోస్ నిర్వహించడం కష్టమే, మరి ఆయన ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.