Jr NTR : అచ్చు గుద్దినట్టు తాత పోలికలతో ఉంటాడు కాబట్టి అందరూ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది బుడ్డోడు అని కూడా పిలుస్తుంటారు. కానీ ఎన్టీఆర్ కి బాగా సన్నిహితంగా ఉండేవారు మాత్రం ‘తారక్’ అని పిలుస్తూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ ని మాత్రం అత్యధిక శాతం మంది బయట పిలిచేది జూనియర్ ఎన్టీఆర్ అనే. అయితే ఇక నుండి ఆ పేరు తో పిలవకూడదు అని ఎన్టీఆర్ తనని అలా పిలిచేవారికి చెప్తున్నాడట. పిలిస్తే తారక్ అని పిలవండి, లేకపోతే ఎన్టీఆర్ అని పిలవండి, అంతే కానీ ఇలా జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రం ఇక పిలవొద్దు అంటూ చాలా బలంగా చెప్పాడట. అంతే కాదు నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ ప్రతీ సినిమాలోనూ టైటిల్ పడే ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పడేది.
కానీ ఇక నుండి మ్యాన్ ఆఫ్ మాస్సస్ అని పడుతుందట. కారణం ఎన్టీఆర్ వయస్సు 40 ఏళ్ళు దాటింది కాబట్టి. తాజాగా ఎన్టీఆర్ టీం నుండి వచ్చిన ఒక ప్రకటన లో ‘మిస్టర్ ఎన్టీఆర్’ అని సంబోధిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసారు. అంటే ఇక నుండి జూనియర్ ని తన పేరు నుండి తొలగించాలి అంటూ టీం అధికారిక ప్రకటన చేసినట్టే అన్నమాట. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి సంబంధించిన షూటింగ్ భాగం మొత్తం పూర్తి అయ్యిందట. మరో వారం రోజుల్లో సినిమాకి సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విలన్ కి ఈ స్థాయిలో ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎవరూ కూడా గ్లిమ్స్ వీడియో విడుదల చెయ్యలేదు. ‘సరిపోదా శనివారం’ చిత్రానికి గానూ విలన్ నటించిన ఎస్ జె సూర్య కి ప్రత్యేకమైన గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు కానీ, స్టార్ హీరోల సినిమాలో మాత్రం దేవరకి మాత్రమే ఆలా జరిగింది.
ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ఈరోజు విడుదలైన గ్లిమ్స్ వీడియో చూసాక ఈ చిత్రంలో విలన్ కి కూడా ఒక ప్రత్యేకమైన పాట ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ పాటని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. రోజు రోజుకు ఈ చిత్రం పై పెరుగుతున్న అంచనాలను సెప్టెంబర్ 27 వ తారీఖున అందుకుంటుందా లేదా అనేది చూడాలి. వచ్చే వారం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.