విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే వెంకీ హీరోగా ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఈ రోజు నుండే వెంకీ ఈ సినిమా షూట్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. కాగా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తీసిన జీతూ జోసెఫ్ నే తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడని తెలిగాయనే ఈ సినిమా పై భారీ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో వెంకటేష్ ఈ సినిమా విషయంలో అసలు కలగచేసుకోవడం లేదు.
సహజంగా వెంకటేష్ చేసే ప్రతి సినిమా కథాకథనాలల్లో సురేష్ ప్రొడక్షన్స్ లోని రైటర్ దగ్గర నుండి సురేష్ బాబు వరకూ అందరూ స్క్రిప్ట్ ను కెలుకుతారు. కానీ, ‘దృశ్యం 2’లో మాత్రం దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారట సురేష్ బాబు. ఐతే, జీతూ జోసెఫ్ మాత్రం, తెలుగు వర్షన్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారని.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు.. అలాగే వెంకటేష్ ఇమేజ్ కి తగ్గట్లు మార్పులు చేశారట. ఇక గతేడాది లాక్డౌన్ కారణంగా కొన్ని సీన్ల షూటింగ్ విషయంలో ఆయన మలయాళం వర్షన్ కి సంబంధించి రాజీ పడ్డారు.
కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ లో మాత్రం ఎలాంటి రాజీ లేకుండా.. పూర్తిగా కథకు న్యాయం చేసేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. తాను మొదట అనుకున్న కొన్ని సీన్లని ఈసారి మరింత పకడ్బందీగా, లావిష్ గా తీయాలని జీతూ జోసెఫ్ బడ్జెట్ ను కూడా కాస్త భారీగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘దృశ్యం 2’ సినిమాని ఏప్రిల్ చివరి నాటికి 60 శాతం పూర్తి చేసి.. మిగతాది ‘నారప్ప’ విడుదల తర్వాత బ్యాలెన్స్ తీస్తారట. మరి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడలి.