Jayasudha : నా భర్త ఆత్మహత్యకు నేను కారణం కాదన్న జయసుధ.. అసలు నిజం ఇదీ

తన భర్త చనిపోవడం ఇప్పటికీ తనకు షాక్ లాగానే ఉందని పేర్కొన్న జయసుధ.. కోవిడ్ సమయంలో ఒత్తిడికి గురయ్యానని వెల్లడించారు. కాగా, జయసుధ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 4, 2024 10:09 pm
Follow us on

Jayasudha : జయసుధ.. సహజనటిగా పేరుపొందిన ఈమె గురించి ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే నేటితరం హీరోల వరకు ఎందరితోనో నటించి మెప్పించారు. ఇప్పటికీ తన వయసుకు తగ్గ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా 80, 90 కాలంలో తిరుగులేని కథానాయకగా జయసుధ వెలుగొందారు. ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. గత ఏడాది విడుదలైన వారసుడు సినిమా తర్వాత జయసుధ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. ఇదే క్రమంలో జయసుధ మూడో పెళ్లి చేసుకున్నారనే పుకార్లు కూడా వినిపించాయి.

ఆ మధ్య జయసుధ ఓ అమెరికాకు చెందిన వ్యాపారవేత్తతో కనిపించారు. అప్పటినుంచి ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నారు.. అందువల్లే అతనితో సన్నిహితంగా ఉంటున్నారు అనే పుకార్లు వినిపించాయి. ప్రస్తుత స్మార్ట్ కాలంలో పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అవి జయ సుధ దాకా వెళ్లినట్టున్నాయి. అందుకే ఆమె స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడం, పెళ్లికి సంబంధించిన పుకార్లపై ఆమె స్పష్టత ఇచ్చారు.”నా రెండవ భర్త నితిన్ కపూర్ అప్పులపల్లి ఆత్మహత్య చేసుకున్నారనడం పూర్తి అబద్ధం. ఆత్మహత్య చేసుకునేంత అప్పులు నా భర్తకు లేవు. ఆయన నిర్మాతగా నష్టపోయారు. దానివల్ల మేము ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం. కానీ అప్పులు చేసేంత కాదు. నేను సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బాగానే సంపాదించేదాన్ని. మాకు ఎప్పుడూ అప్పుడు కాలేదు. మాత్తింటి వాళ్లకు ఉన్న శాపం వల్లే మా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.. మా ఆయన వాళ్ళ అన్నయ్య కూడా అలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. వీరిద్దరి మాత్రమే కాదు మా అత్తింటి వారికి సంబంధించిన మరో ఇద్దరు కూడా ఇలాగే బలవన్మరణానికి పాల్పడ్డారు. అది పూర్వజన్మల శాపం వల్ల జరుగుతుందని కొంతమంది అంటున్నారు. ఆ శాపం నా పిల్లలకు ప్రతిబంధకం కాకూడదని నేను ప్రతిరోజు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. మనిషి నోటి నుంచి వచ్చే మాటల ఆధారంగానే చావు, బతుకులు ముడిపడి ఉంటాయి. అలాంటి మాటలను నేను కచ్చితంగా నమ్ముతాను. ఒక మనిషి నాశనం కావాలని శపించారంటే అది కచ్చితంగా జరిగి తీరుతుంది. మనం దేని నుంచి అయినా కూడా బయటపడగలం గాని.. శాపం నుంచి విముక్తులను కాలేం. అలాంటి వాటి నుంచి దేవుడు కూడా మనల్ని కాపాడలేడని” జయసుధ వ్యాఖ్యానించారు.

ఇక తన భర్త మరణించిన తర్వాత మామూలు మనిషిని కావడానికి చాలా సమయం పట్టిందని జయసుధ పేర్కొన్నారు. మూడు నెలల పాటు తాను షాక్ లోనే ఉన్నానని వెల్లడించారు. అలాంటి క్లిష్ట సమయంలో కుటుంబం తనకు అండగా నిలిచిందని ఆమె వివరించారు. ముంబైలో ఉన్న ఆమె సోదరీమణులు రోజూ ఫోన్ చేసి మాట్లాడేవారట. ధైర్యంగా ఉండాలని చెప్పే వారట. తన భర్త చనిపోయిన సమయంలోనే దిల్ రాజు జయసుధకు శతమానం భవతి సినిమాలో పాత్ర ఆఫర్ చేశారట. తాను చేయనని చెప్పినప్పటికీ బలవంతం చేసి మరీ ఆ పాత్రలో నటింప చేశారట. షూటింగ్ సమయంలోనే దిల్ రాజు భార్య చనిపోవడంతో.. ఆయన కూడా తన బాధను జయసుధ తో షేర్ చేసుకునే వారట. అలా తన భర్త చనిపోయిన బాధ నుంచి జయసుధ కొంత కోలుకున్నారట. అమెరికాకు చెందిన వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నానడం లో అర్థం లేదని జయసుధ కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది రాస్తున్నారని.. ప్రతి దానికి వివరణ ఎలా ఇస్తామని జయసుధ పేర్కొన్నారు. తన భర్త చనిపోవడం ఇప్పటికీ తనకు షాక్ లాగానే ఉందని పేర్కొన్న జయసుధ.. కోవిడ్ సమయంలో ఒత్తిడికి గురయ్యానని వెల్లడించారు. కాగా, జయసుధ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.