Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళం , హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది ‘జన నాయగన్ ‘ చిత్రం. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నుండి రాబోతున్న మొట్టమొదటి సినిమా ఇది. చివరి సినిమా కూడా ఇదే. కాబట్టి ఆయన అభిమానులకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. అయితే ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు హెచ్ వినోద్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముందుగా ఆయన ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
అయన మాట్లాడుతూ ‘ ఈ చిత్రంలో పూజ హెగ్డే ఒక రిపోర్టర్ పాత్ర లో కనిపిస్తారు. ముందుగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నప్పుడు ఆమెకు సంబంధించి చాలా సన్నివేశాలు ఉన్నాయి. కానీ సమయాభావం వల్ల వాటిని చిత్రీకరించలేకపోయాము. అంతే కాకుండా ఆమెపై చిత్రీకరించిన సన్నివేశాలను కూడా ఫైనల్ ఎడిటింగ్ లో కత్తిరించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పూజ హెగ్డే కి కూడా వివరించి క్షమాపణలు చెప్పాము’ అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్. ఇక ఈ చిత్రంలో విజయ్ కి కూతురు పాత్ర పోషించిన మమిత బైజు పాత్ర ఎంపిక విషయంపై డైరెక్టర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయన మాట్లాడుతూ ‘ప్రేమలు సినిమా చూసినప్పుడు మమిత నటన నాకు చాలా బాగా నచ్చింది. ఈ చిత్రంలో విజయ్ కూతురి పాత్ర కోసం శ్రీలీల , మమిత లలో ఎవరిని తీసుకోవాలి అనే సందిగ్ధం లో ఉన్నప్పుడు అందరూ మమిత పేరు నే సూచించారు’.
‘ఆమె ప్రవర్తన తీరు , ఎనర్జీ ని చూస్తే లేడీ విజయ్ లాగానే అనిపిస్తుందని , టీమ్ చెప్పడంతో ఆమెని తీసుకున్నాము. ముఖ్యంగా డ్యూడ్ చిత్రం లో ఆమె నటన చూసిన విజయ్ గారు , ఈమెకు మరింత యాక్షన్ సన్నివేశాల్లో నటించే స్కోప్ ఇవ్వాలని సూచించారు. అందుకే ఆమె కోసం మరిన్ని సన్నివేశాలను డిజైన్ చేశాము’ అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ వినోద్. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి’ కి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కేవలం కొన్ని సన్నివేశాలను మాత్రమే తీసుకున్నామని డైరెక్టర్ చెప్పారు కానీ , ట్రైలర్ ని చూస్తుంటే ‘భగవంత్ కేసరి’ కి జిరాక్స్ కాపీ ని తీసినట్టుగానే అనిపించిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



