
పూలు అమ్మిన చోటే, కట్టెలమ్మాల్సిన పరిస్థితి రావడం అంటే.. నిజంగా దౌర్భాగ్యమే. లేకపోతే ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసిన సినిమాలతో ఒకప్పుడు అద్భుతమైన సక్సెస్ లు చవిచూసిన నిర్మాత ఎమ్ఎస్ రాజు, ఇప్పుడు కోటి రెండు కోట్లు కోసం బూతు సినిమాలు చేసుకోవాల్సి రావడం ఏమిటి ? కచ్చితంగా ఇది ఆయన స్థాయిని తగ్గించేదే.
అసలు ఆ మాటకొస్తే ఎమ్ఎస్ రాజు అంటే.. మహేష్ నుండి ప్రభాస్, వెంకటేష్ వరకూ డేట్స్ ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉండేవాళ్లు. కానీ, కాలం ఒకేలా ఉండదు కదా, రాజుగారి ప్రభ వైభవం కూడా తగ్గాయి. ఎమ్ఎస్ రాజు ప్లేస్ లో దిల్ రాజు వచ్చాడు. చివరకు ఎమ్ఎస్ రాజు నిర్మాతగా కూడా కొనసాగలేక, దర్శకుడిగా యూటర్న్ తీసుకుని ఓటీటీల కోసం బోల్డ్ సినిమాలను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఎక్కువుగా రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో తానూ ఇక నుండి సినిమాలు చేస్తానని చెబుతున్న ఎమ్ఎస్ రాజు, మరి ‘డర్టీ హరి’లానే హిట్స్ కొడతాడా ? తానూ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘డర్టీ హరి’ ఈ జనరేషన్ కు నచ్చే విధంగా, వారు మెచ్చే అంశాలు అన్నీ మిళితం చేసి, పనిలో పనిగా బూతు కంటెంట్ విషయంలో కూడా బోర్డర్స్ దాటేసి విచ్చలవిడిగా ముందుకు పోయారు రాజుగారు.
ఇప్పుడు మరో ‘డర్టీ హరి’ లాంటి సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నాడు ఎమ్ఎస్ రాజు. కేవలం సెక్స్ రొమాన్స్ తో సాగే ఈ సినిమా కూడా ఓటీటీ కోసమే తీస్తున్నాడట. తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి కథ, కథనాలు, అండర్ కరెంట్ మెసేజ్ కూడా ఉంటుందని చెబుతున్నాడు ఈ పెద్దాయన. ఏది ఏమైనా రాజుగారు ఇలా బోల్డ్ సినిమాల మీద పడటం బాగాలేదు.