ANR Centenary Celebrations: లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు సెప్టెంబర్ 20న ఘనంగా నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాన్నగారికి అన్నపూర్ణ స్టూడియోస్ ఇష్టమైన ప్రదేశం. నచ్చిన ప్రదేశంలో విగ్రహం ఆవిష్కరిస్తే ప్రాణం పోసినట్లే అంటారని నాగార్జున అన్నారు. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, రాజమౌళి, రామ్ చరణ్, నాని, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, జయసుధ, మోహన్ బాబు, మంచు విష్ణు, బ్రహ్మానందంతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు.
అయితే నందమూరి ఫ్యామిలీ నుండి ఒక్కరంటే ఒక్కరు రాలేదు. ముఖ్యంగా బాలయ్య వస్తారని అందరూ అనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాలేదు. తాతయ్య ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రాకుండా ఏఎన్నార్ కార్యక్రమానికి హాజరైతే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన దూరంగా ఉన్నారన్న మాట వినిపిస్తోంది. నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ ఆయన రాలేదు. ఇక బాలయ్య రాకపోవడానికి కారణం ఇదే అంటూ అనేక వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో బాలకృష్ణ రాజమండ్రిలో ఉన్నారు. ఈ కారణంగా ఆయన హాజరు కాలేదంటున్నారు. నాగార్జునతో బాలయ్యకు అంత సఖ్యత లేదు. ఇటీవల బాలయ్య తన స్పీచ్ లో అక్కినేని తొక్కనేని అంటూ అమర్యాదగా మాట్లాడాడు. ఇది వివాదం రాజేసింది. అఖిల్, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా అసహనం వెళ్లగక్కారు. అక్కినేని ఫ్యామిలీతో ఉన్న గొడవలే ఇందుకు కారణం అంటున్నారు.
అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో నాగ చైతన్య పాల్గొనడం విశేషం. మరి చిరంజీవి ఎందుకు హాజరు కాలేదనే వాదన ఉంది. చిరంజీవికి ఇటీవల మోకాలి సర్జరీ జరిగింది. ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. నడవలేరు. అందుకే ఆయన రాలేదట. నాగార్జున-చిరంజీవి చాలా సన్నిహితంగా ఉంటారు. చిరంజీవి రాకున్నా ట్విట్టర్ వేదికగా తన ప్రేమను చాటుకున్నారు. అలాగే రామ్ చరణ్ స్వయంగా హాజరయ్యారు.