Mainampally Hanumantha Rao: ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో జరిగిన ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ నిర్దేశించుకున్న నియమం ఇది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ నిబంధనను అతిక్రమించకుండా ప్రియాంకా గాంధీ కనీసం పోటీ కూడా చేయలేదు. అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలోనూ ఇదే విధానాన్ని అవలంబించింది. బిజెపి మీద గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరికి టికెట్ ఇస్తామని విధించుకున్న నిబంధన సక్రమంగా అమలవుతుందా? లేకుంటే ఇక్కడ ఆ నిబంధనను సడలిస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పనమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విధించిన నిబంధన ఇక్కడ ఎందుకు సడలిస్తారు? సడలించేంత గొప్ప నాయకుడు తెలంగాణలో ఎవరున్నారు?
రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీష్ రావు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. అవి కేసీఆర్ కు ఆగ్రహం కలిగించాయి. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. దీంతో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే హనుమంతరావు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన తనతో పాటు తన కుమారుడికి కూడా పార్టీ టికెట్లు ఇస్తుందని చెబుతున్నారు. తాను మాల్కాజ్ గిరి నుంచి, తన కుమారుడు మెదక్ నుంచి పోటీ చేస్తామని ప్రకటిస్తున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే టికెట్ అనే నిబంధన విధించిన నేపథ్యంలో హనుమంతరావు కుటుంబానికి రెండు టికెట్లు ఎలా కేటాయిస్తుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతంలో రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లో జరిగిన ప్లీనరీలో ఇదే విషయం మీద కాంగ్రెస్ పార్టీ ఒక ఏకాభిప్రాయాన్ని ఆమోదించింది. అలాంటప్పుడు హనుమంతరావు కుటుంబానికి రెండు టికెట్లు ఎలా ఇస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఒకవేళ హనుమంతరావు చెప్పినట్టు ఆయన కుమారుడికి, అయనకు టికెట్లు కేటాయించిన నేపథ్యంలో మిగతావారు కూడా తమ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నను అధిష్టానం ఎదుట సంధించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే జానారెడ్డి తనతో పాటు తన కుమారుడికి టికెట్ అడుగుతున్నారు. ఉత్తంకుమార్ రెడ్డి తనతో పాటు తన భార్యకు కూడా టికెట్ అడుగుతున్నారు. సీతక్క కూడా తనతో పాటు తన కుమారుడికి టికెట్ అడుగుతున్నారు. సీనియర్ నేత దామోదర రాజనర్సింహ కూడా తనతో పాటు తన భార్య కూడా టికెట్ ఆడుతున్నారు. వీరిలో సీతక్క మినహా మిగతా వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు. వీరు టికెట్ అడగడంలో ఒక ఉద్దేశం ఉంది. కానీ పార్టీలో చేరకముందే హనుమంతరావు తనకు రెండు టికెట్లు అడగడం.. విలేకరుల సమావేశంలో తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిందని చెబుతుండడం.. ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీనిపై సీనియర్ నేతలు నోరు మెదపకపోయినప్పటికీ రెండు టికెట్లు ఎలా సాధ్యం అని అంతర్గతంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ టికెట్ల గొడవ వల్ల కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు మరింతగా పెరుగుతున్నాయి. మొన్నటిదాకా 42 మందికి టికెట్లు ఖరారు చేశారని గాంధీభవన్ వేదికగా మీడియాకు లీకులు అందాయి. అయితే టికెట్లు కేటాయింపు లాంటిది ఏమీ లేదని స్వయానా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇంకా ఎవరికి టికెట్లు ఖరారు కాలేదని తెలుస్తోంది. మరోవైపు గ్రూపు రాజకీయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేజేతులా అధికారాన్ని దూరం చేసుకుంటున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఇప్పటికే పలు సర్వేలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని చెబుతున్నాయి. అధికార భారత రాష్ట్ర సమితిలో ఈ పరిణామం ఒకింత ఆందోళన కలగజేస్తోంది. అయితే ఇలాంటి సందర్భంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో సతమతమవుతుండడం, టికెట్ల కేటాయింపులో ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాకపోవడం.. ఆ పార్టీ కార్యవర్గాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది.