Naveen Polishetty: ఇటీవల కాలంలో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కుర్ర హీరోలలో రెండు, మూడు సినిమాలకే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు నవీన్ పోలిశెట్టి. హైదరాబాద్ లో అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబం లో పుట్టి పెరిగిన నవీన్ పోలిశెట్టి, NIT భూపాల్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, లండన్ లో నెలకు నాలుగు లక్షల రూపాయిలు వచ్చే ఉద్యోగం చేసేవాడు. అయితే ఈయనకి చిన్నప్పటి నుండి సినిమాల మీద విపరీతమైన ఇష్టం ఉండేది. ఉద్యోగం సమర్థవతంగా చేసేవాడే కానీ, అతనిలో మానసిక సంతృప్తి లేదు. సినిమా యాక్టర్ అవ్వాలనే కోరిక రోజురోజుకి ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. అలా సినీ నటుడు అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇండియా కి తిరిగి వచ్చాడు. సినిమాల్లో అవకాశాలు అంత తేలికగా దొరకదు. కాళ్ళు అరిగిపోయే రేంజ్ లో తిరగాలి. నవీన్ పోలిశెట్టి కూడా అలాగే తిరిగాడు కానీ, అవకాశం రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
కొత్త టాలెంట్స్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేయడం ఎప్పుడూ ముందు ఉండే శేఖర్ కమ్ముల, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో కొత్తవాళ్లు కోసం చేసిన ఆడిషన్ లో నవీన్ పోలిశెట్టి కూడా పాల్గొన్నాడు. అతనిలోని నటనని చూసి ఎంతో మెచ్చుకున్న శేఖర్ కమ్ముల వెంటనే తన సినిమాలో తీసుకున్నాడు. ఈ చిత్రంతో నవీన్ పోలిశెట్టి కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆ తర్వాత ఈయనకి బాలీవుడ్ లో AIB అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం దక్కింది. ఒక పక్క తెలుగు క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేస్తూనే, బాలీవుడ్ లో ఇలాంటి షోస్ కి యాంకర్ గా చేసేవాడు. 2016 వ సంవత్సరం లో ఆయన 24 అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ ని తెలుగు దబ్ చేసి జీ తెలుగు లో కొంతకాలం టెలికాస్ట్ చేసారు. సీరియల్ లాగా టెలికాస్ట్ అయిన ఈ వెబ్ సిరీస్ మన తెలుగు ఆడియన్స్ కి అంతగా రీచ్ కాలేదు.
ఇక ఆ తర్వాత ‘వాట్స్ యూత్ స్టేటస్’ అనే షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు నవీన్ పోలిశెట్టి. ఈ షో ఆయనకీ మామూలు క్రేజ్ ని తెచ్చిపెట్టలేదు. ఆయన పేరు ఇండియా మొత్తం మారుమోగిపోయింది. ఆ తర్వాత ఈయనకి తెలుగు లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంలో హీరో గా నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నవీన్ పోలిశెట్టి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ లో నటించాడు. ప్రస్తుతం ఆయన ‘అనగనగ ఒక రాజు’ అనే చిత్రం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుండగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.