Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) జీవితం, ప్రతీ మనిషి తన జీవితం లో పైకి ఎదగడానికి ఒక దిక్సూచి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఆయన జీవితం గురించి తెలుసుకుంటే మనలో కూడా మనిషి పుట్టుక పుట్టినందుకు, కచ్చితంగా ఎదో ఒకటి సాధించి తీరాలి అనే కసి, పట్టుదల కలుగుతుంది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి, అంచలంచలుగా ఎదుగుతూ, నేడు ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని చూసి గర్వించే రేంజ్ కి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ ఎదుగుదల వెనుక ఆయన కష్టం తో పాటు, కన్నీళ్లు, దెబ్బలు, అవమానాలు, నిటూర్పులు ఇలా ఎన్నో ఉన్నాయి. ఆయన జీవితం లో జరిగిన కొన్ని అవమానాలను తన విజయానికి మెట్లుగా ఎలా మార్చుకున్నాడో, ఒక ఈవెంట్ లో చిరంజీవి చెప్పుకొచ్చాడు.
అది విన్న తర్వాత అవమానానికి గురైన ఏ మనిషి కూడా కృంగిపోడు, దానిని తన విజయానికి మెట్టు గా మార్చుకుంటాడు, జీవితం లో కచ్చితంగా విజయం సాధించి తీరాలి అనే కసి కలుగుతుంది. తన జీవితం లో జరిగిన ఒక అవమాన సంఘటన గురించి చిరంజీవి మాట్లాడుతూ ‘న్యాయం కావాలి చిత్రం షూటింగ్ లో నేను బిజీ గా ఉన్న రోజులవి. క్రాంతి కుమార్ నిర్మాత, కోదండరామి రెడ్డి గారు దర్శకుడు. షాట్ బ్రేక్ మధ్యలో నేను కాస్త రిలాక్స్ అవుదామని బయటకు వచ్చి నిల్చున్నాను. ఈలోపు మరో షాట్ రెడీ అయ్యింది, అసిస్టెంట్ డైరెక్టర్ రమ్మని పిలిస్తే వెంటనే వెళ్లి నిల్చున్నాను. కెమెరా వద్ద కూర్చున్న నిర్మాత క్రాంతి కుమార్ నాపా అరుస్తూ , ఏమయ్యా నిన్ను ప్రత్యేకంగా పిలవాలా?, ఇక్కడ ఉండలేవా?, జగ్గయ్య, శారదా వంటి పెద్ద స్టార్స్ ఇక్కడే ఉన్నారు కదా , అప్పుడే పెద్ద సూపర్ స్టార్ అయ్యాను అని అనుకుంటున్నావా, ఇక్కడే ఉండు అని గట్టిగా అరిచాడు’.
‘ఆయన అలా నాపై అరవడాన్ని అక్కడ 300 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు చూసారు. నాకు చాలా అవమానంగా అనిపించింది. మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేకపోయాను. సాయంత్రం షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్లిన కాసేపటికి క్రాంతి కుమార్ ఫోన్ చేసాడు. చెప్పండి సార్ అన్నాను. ఏమి లేదయ్యా, శారదా గారికి వయస్సు పెరగడం వల్లనో ఏమో తెలియదు కానీ, జ్ఞాపక శక్తి తగ్గినట్టు ఉంది, ఫిల్మ్ తినేస్తుంది అని అన్నాడు. అప్పట్లో ఫిల్మ్ కేవలం ఒక కోటా వరకే ఉండేది. ఆయన టెన్షన్ లో ఆయన ఉన్నాడు, శారదా గారి మీద ఉన్న కోపం నామీద చూపించాడు. కానీ అది పద్దతి కాదు కదా, కానీ ఆయన అన్న ఒక మాట ని నేను మనసులో బలంగా రిజిస్టర్ చేసుకున్నాను. పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా అన్నాడు, అవును సూపర్ స్టార్ ని అయ్యి చూపించాలి అనే కసి నాలో పెరిగింది. అయ్యి చూపించాను’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్.