https://oktelugu.com/

Daggubati Purandeswari: పురందేశ్వరి జాగ్రత్త పడకుంటే కష్టమే

మొన్నటికి మొన్న సీఎం జగన్ సైతం చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర పెద్దల పాత్ర ఉందని సంకేతాలు ఇచ్చారు. గత ఎన్నికలకు ముందే చంద్రబాబు అవినీతి విషయాన్నీ కేంద్ర పెద్దలు తెలుసుకున్నారని గుర్తు చేశారు.

Written By: , Updated On : October 12, 2023 / 04:03 PM IST
Daggubati Purandeswari

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి నియామకం తెలుగుదేశం పార్టీకి షాక్ అవుతుందని అందరూ భావించారు. కానీ అది వైసీపీకేనని తెలియడంతో అధికార పార్టీ ఓకింత షాక్ కు గురైంది. అయినా సరే బిజెపి కేంద్ర నాయకత్వంతో జగన్ సన్నిహిత సంబంధాలు ఉండడంతో పురందేశ్వరిని లైట్ తీసుకున్నారు. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత పురందేశ్వరి దూకుడుగా వ్యవహరించారు. వేగంగా పావులు కదిపారు. వైసిపి సర్కార్ను కేంద్ర పెద్దల వద్ద దోషిగా నిలిపే ప్రయత్నం చేశారు. కానీ నిన్నటి వరకు వైసిపిదే పై చేయిగా నిలుస్తూ వచ్చింది.

ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ ను అమిత్ షా ముందు కూర్చోబెట్టగలిగారు పురందేశ్వరి. తండ్రి అరెస్టు తర్వాత నెల రోజులుగా లోకేష్ ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. ఈ తరుణంలో పెద్దమ్మ పురందేశ్వరి చొరవ తీసుకుని లోకేష్ ను అమిత్ షాను కల్పించగలిగారు. కొద్దిపాటి ఊరట ఇవ్వగలిగారు. చంద్రబాబును ఎలాగైనా బయటకు తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా ఆమె చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న సీఎం జగన్ సైతం చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్ర పెద్దల పాత్ర ఉందని సంకేతాలు ఇచ్చారు. గత ఎన్నికలకు ముందే చంద్రబాబు అవినీతి విషయాన్నీ కేంద్ర పెద్దలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. అందుకే ఈడిని ప్రయోగించి కేసులు నమోదు చేశారని.. కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించిన తర్వాతే.. ఏపీ సిఐడి ఎంటరై దర్యాప్తు ప్రారంభించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. అప్పటివరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సైతం బిజెపి పెద్దలు ఉన్నారన్న అనుమానం ఉంది. దానిని మరింత పెంచేందుకు జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అమిత్ షాను.. లోకేష్ ను కల్పించిన తర్వాత పురందేశ్వరి ఓ ట్విట్ చేశారు.’ రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు గురించి అమిత్ షాకు లోకేష్ వివరంగా చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బిజెపి ఉందనే వాళ్ళు ఇప్పుడు చెప్పండి. మీరంటున్నది నిజమైతే లోకేష్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారా?’ అని ప్రశ్నించారు.

అటు లోకేష్ ను అమిత్ షాకు కలపడం ఒక ఎత్తు అయితే.. తమను టార్గెట్ చేయడంపై పురందేశ్వరి పై వైసీపీ ఆగ్రహంగా ఉంది. ఆ సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం ఆమె చర్యలను వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో టిడిపి తో పాటు అనుకూల మీడియా ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. దీనినే కొనసాగిస్తూ పురందేశ్వరి ముందుకు సాగగలిగితే మున్ముందు ఆమె పాత్ర క్రియాశీలకం కానుంది. తెలుగుదేశం, జనసేనతో బిజెపి కలిసి వస్తే పురందేశ్వరికి కూటమిలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ మూడు పార్టీల మధ్య సయోధ్య వస్తేనే అది సాధ్యమవుతుంది. లేకుంటే మాత్రం పురందేశ్వరి వ్యూహానికి ఎదురు దెబ్బ ఖాయం.