Manchu Vishnu : మంచు కుటుంబంలో వివాదాలు రోజురోజుకి ఎలాంటి మలుపులు తీసుకుంటున్నాయో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ విషయంపై మోహన్ బాబు చాలా మానసిక వేదనకు గురయ్యాడు. మనోజ్ చేస్తున్న చర్యల పట్ల తీవ్రమైన అసహనంతో ఉన్నాడు. రీసెంట్ గానే ఆయన మనోజ్ తన ఆస్తుల్లో ఉండడానికి వీలు లేదని, తక్షణమే అతన్ని తన ఆస్తుల్లో నుండి ఖాళీ చేయాల్సిందిగా కోరుతూ మేజిస్ట్రేట్ లో ఫిర్యాదు చేసారు. దీనిపై నిన్న సాయంత్రం మనోజ్ స్పందిస్తూ ‘మా నాన్నని నేనెప్పుడూ తప్పుబట్టను..ఆయన చాలా మంచి వారు. ఆయన్ని అడ్డం పెట్టుకొని మా అన్నయ్య విష్ణు నాటకాలు ఆడుతున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు నిన్న ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన తన కుటుంబ కలహాల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘మా తండ్రి మా ముగ్గురిని సరిసమానంగా పెంచాడు. ఒకరిని ఎక్కువ చేయలేదు, ఒకరిని తక్కువ చేయలేదు. ఏ ఇంట్లో సమస్య ఉన్నా, ఇంటికి పిలిచి నాలుగు గోడల మధ్య పరిష్కరించే మా నాన్న, ఇప్పుడు తన ఇంట్లో సమస్యలు రోడ్డు మీదకి రావడం పై తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తుల గురించి ప్రత్యేకంగా ఒకటి చెప్పాలి. మా నాన్న గారు మాకు చదువు అనే గొప్ప ఆస్తిని ఇచ్చారు. దాంతో మా కాళ్ళ మీద మేము నిలబడాలి. ఆయన ఆస్తి కోసం ఎదురు చూడకూడదు, వెళ్లి మాకు ఆ ఆస్తి ఇవ్వు అని అడగకూడదు’ అంటూ చెప్పుకొచ్చాడు. మనోజ్ కి భయపడి దుబాయి లో స్థిరపడ్డారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి విష్ణు సమాధానం చెప్తూ ‘నా జీవితంలో తండ్రికి తప్ప ఎవరికీ భయపడను..కానీ ఇప్పుడు నా భార్యకు భయపడాల్సి వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు.
మనోజ్ తో కలిసిపోతారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘ కచ్చితంగా కలిసిపోతాను. పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచంలో ఉండదు. కాలమే అన్నిటికి సమాధానం చెప్తుంది. ప్రస్తుతానికి చాలా వరకు సమస్యలు సర్దుకున్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు. ఇంత కూల్ గా కలిసిపోతాను అని విష్ణు అంటున్నాడు కానీ, మనోజ్ నుండి అలాంటి సిగ్నల్స్ లేవు. గత రెండు రోజులుగా ఆయన సోషల్ మీడియా లో విష్ణు పై ఏ రేంజ్ సెటైర్లు వేస్తున్నాడో మన కళ్లారా చూసాము. దమ్ముంటే చర్చకు రా, తేల్చుకుందాం అంటూ సవాల్ విసురుతున్నాను అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని చూస్తున్న నెటిజెన్స్, ఏంటి మాకు ఈ తలనొప్పి మళ్ళీ మొదలు పెట్టారా అంటూ పెదవి విరుస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం మనోజ్ మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.