బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీని తీవ్రంగా కలచి వేస్తోంది. మానసిక ఒత్తిడితో తనువు చాలించిన సుశాంత్ మరణ వార్త విని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎన్ని సమస్యలు ఉన్నా పోరాడి నిలబడాలని, చావే అన్నింటికీ పరిష్కారం కాదని చెబుతున్నారు. ఏదైనా సమస్యలు ఉన్నవాళ్లు వాటి గురించి మాట్లాడి పరిష్కారం పొందాలని సూచిస్తున్నారు. రంగుల జీవితంలో తమకు ఎదురైన సమస్యల నుంచి ఎలా బయట పడ్డామో వివరిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాది సీనియర్ నటి ఖష్బు సంచలన విషయాలు బయటపెట్టింది. ఒక దశలో తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు వెల్లడించింది. కానీ, మానసిక ఒత్తిడిపై పోరాడాలనే కసి ఏర్పడడంతో తన నిర్ణయం మార్చుకున్నా అని తెలిపింది.
‘ఒకానొక దశలో నా జీవితం ఆగినట్లు అనిపించింది. భయం వేసింది. అప్పుడు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నా. కానీ, నాలోని ధైర్యం నన్ను ఆ నిర్ణయం తీసుకోనివ్వకుండా వెనకడుగు వేసేలా చేసింది. నన్ను సమస్యలవైపు నడిపిస్తున్న వాటిని చూసి ఏ రోజూ భయపడలేదు. నన్ను ఓడించి, నాశనం చేయాలనుకుంటున్న సమస్యలకంటే నేనే దృఢమైనదాన్ని అని నిరూపించాలని నిర్ణయించుకున్నా. నాలో పోరాడే శక్తి ఉండటంతో ధైర్యంగా ముందడుగు వేశా. పరాజయాల్ని విజయాలుగా మార్చుకోవడం నేర్చుకుని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా’ అని ట్విట్టర్లో తన అనుభవాలు రాసుకొచ్చింది. ఆత్మహత్య ఆలోచన నుంచి బయట పడేందుకు తన స్నేహితులు దేవదూతల్లా అండగా నిలిచారని చెప్పింది.