M. M. Keeravani: RRR సినిమాలో నాటు నాటు పాటతో ఆస్కార్ ను మన తెలుగు చిత్ర పరిశ్రమకు తెచ్చిన కీరవాణి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా రాజమౌళి సినిమాలకు సంగీతం అందించే కీరవాణి అప్పుడప్పుడు బయట సినిమాలకు పని చేస్తాడు. తాజాగా ఆయన చంద్రముఖి 2 సినిమా కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చంద్రముఖి 2 సినిమా దాదాపు పూర్తి అయ్యింది. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దీని గురించి కీరవాణి మాట్లాడుతూ ” ఈ సినిమాలో పాత్రలు చావు భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతుంటాయి. ఆ అద్భుతమైన సన్నివేశాల కోసం నేను 2 నెలలు నిద్రపోకుండా సంగీతం అందించా ” అంటూ చెప్పుకొచ్చాడు. అదే విధంగా సంగీత దర్శకులు గురుకిరణ్, విద్యాసాగర్ ఆశీస్సులు కావాలని కోరాడు కీరవాణి.
గతంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాకు విద్యాసాగర్ సంగీత దర్శకుడిగా పని చేశారు, అందుకే ఆయన ఆశీస్సులు కావాలని కీరవాణి అడగడం జరిగింది. ఈ పోస్ట్ పై స్పందించిన నెటిజన్లు గురువు గారు మీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం మేము ఎదురు చూస్తున్నాం.. లక..లక..లక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2005 లో విడుదలైన చంద్రముఖి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు, వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న రజినీకాంత్ కి బూస్ట్ ఇచ్చిన సినిమా చంద్రముఖి.
దీనికి పరంపరలో రాబోతున్న సినిమా కావటంతో లారెన్స్ నటిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.. ఇందులో రాజనర్తకిగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తుంది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ లో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలనీ నిర్మాణ సంస్థ లైకా భావిస్తుంది.