Pawan Kalyan:మార్చి 14 ప్రతీ ఏడాది పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) అభిమానులకు ఒక పండుగ వాతావరణం లాంటిది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత మళ్ళీ మెగా కుటుంబం నుండి మరొకరు రాజకీయాల్లోకి రాగలరా అనే ప్రశ్నలు ఎదురు అవుతున్న సమయంలో, రాష్ట్రం రెండు గా విడిపోయినప్పుడు, పవన్ కళ్యాణ్ ఒక ఆవేదనతో పెట్టిన పార్టీ జనసేన (Janasena Party). మొదటి ప్రసంగం ఆరోజుల్లో ప్రకంపనలు రేపింది. అయితే అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి సమయం లేకపోవడంతో తెలుగు దేశం పార్టీ, బీజేపీ కి తన మద్దతుని ప్రకటించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేసాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు కూటమికి మద్దతుగానే ఉన్నాడు కానీ, మధ్యలో టీడీపీ, బీజేపీ లకు రివర్స్ అయ్యి 2019 ఎన్నికలలో వామపక్షాలతో పొత్తు పెట్టుకొని పోటీ చేసాడు. ఫలితం ఎంత దారుణంగా వచ్చిందో మనమంతా చూసాము.
పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజోలు నుండి రాపాక వరప్రసాద్ ఒక్కడు మాత్రమే గెలిచాడు. ఆయన కూడా కొన్నాళ్ళకు వైసీపీ లోకి వెళ్ళిపోయాడు. ఆ ఐదేళ్లు జనసేన పార్టీ అభిమానులకు నరకం అనే చెప్పాలి. ఎన్నో అవమానాలు ఎదురుకున్నారు, ఎన్నో తిట్లు భరించారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మొండిగా నిలబడి పార్టీ ని నిలుపుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కూటమి ని కట్టి, ఆ కూటమి సంచలన విజయానికి కారణం అయ్యాడు. నేడు సీఎం చంద్రబాబు తో సమానంగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, 5 శాఖలకు మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తూ, ఫుల్ బిజీ గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్ తీసుకున్న తర్వాత గ్రామాల రూపు రేఖలు మారిపోతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి విజయం సాధించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో, ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.
అందుకే పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రతీ జిల్లాకు పర్యటించి, జనసేన కార్యకర్తలు ఈ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు. అయితే ఈ వేడుకలకు ఖర్చు కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతుంది. సభకు వచ్చే అభిమానుల కోసం భారీ ఎత్తున భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. పిఠాపురం లోని ప్రతీ గ్రామంలో తెలుపు, ఎరుపు రంగులతో కూడి ఉన్న సీరియల్ బల్బులను ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమానికి దాదాపుగా రెండు కోట్ల రూపాయిల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇంత డబ్బులు ఒక సభ కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు, దీనికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి?, సొంత డబ్బులతో చేస్తున్నారా? , లేదా ప్రభుత్వ నిధులతో చేస్తున్నారా అనే విమర్శలు కూడా ఎదురు అవుతున్నాయి. దీనికి పవన్ కళ్యాణ్ మార్చి 14న సమాధానం చెప్తాడో లేదో చూడాలి.