Hero Yash: కన్నడ స్టార్ యష్ కెజిఎఫ్ చిత్రాలతో ఫేమస్ అయ్యాడు. ఆయన గత చిత్రం కెజిఎఫ్ 2 దాదాపు రూ. 1200 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి రికార్డు సృష్టించింది. ఇంతటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న యష్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. తన నెక్స్ట్ ఫిల్మ్ కోసం అభిమానులు ఎదురు చూశారు. ఎట్టకేలకు టాక్సిక్ టైటిల్ తో ఓ మూవీ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మళయాళ క్రేజీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా 2025 ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు సమాచారం.
కాగా యష్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకంటే ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. విరామం దొరికితే ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంటాడు. తాజాగా నార్త్ కెనడాలోని షిరాలికి యష్ కుటుంబంతో కలిసి వెళ్ళాడు. స్థానిక చిత్రపురి మఠాన్ని సందర్శించాడు. అక్కడ ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. యష్ ని భార్య రాధిక ఐస్ క్యాండీ అడిగింది. వీధి పక్కన ఉన్న చిన్న కిరాణా షాప్ లో కి వెళ్లి భార్య కోసం ఐస్ క్యాండీ కొని తెచ్చాడు.
అలాగే కూతురి కోసం కొన్ని చాక్లెట్లు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యష్ అభిమానులు ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో భార్య కోసం ఖరీదైన బహుమతులు ఇవ్వనక్కర్లేదు. మనసు తెలుసుకుని ఆమె చిన్న చిన్న కోరికలు తీర్చగలిగితే అదే నిజమైన ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు. యష్ సింప్లిసిటీ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
కెజిఎఫ్ చిత్రాలతో యష్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. దేశవ్యాప్తంగా ఆయనకు మార్కెట్ ఏర్పడింది. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్, కెజిఎఫ్ 2 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మరోవైపు ప్రశాంత్ వర్మ అప్ కమింగ్ మూవీ జై హనుమాన్ లో యష్ నటిస్తున్నాడంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ హనుమాన్ కి ప్రశాంత్ వర్మ సీక్వెల్ ప్రకటించగా, అందులో ఒక స్టార్ హీరో నటిస్తారని ఆయన స్వయంగా వెల్లడించారు.