Siddam Sabha: రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా స్తంభించింది. ముఖ్యంగా రాయలసీమలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులను తరలించారు. అధికార పార్టీ ముందు ఆర్టీసీ మోకరిల్లింది. ఏకంగా మూడు వేల బస్సులను కేటాయించింది. చివరకు తిరుమల దేవస్థానానికి వెళ్లే బస్సులను సైతం వదల్లేదు. దాదాపు రాయలసీమతో పాటు విజయవాడ వరకు బస్సుల కేటాయింపు కొనసాగినట్లు తెలుస్తోంది. దాదాపు ప్రజా రవాణా స్తంభించడంతో ఎక్కడికక్కడే ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధం పేరిట జరిగిన ఈ సభలు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో పూర్తయ్యాయి. ఈరోజు అనంతపురం జిల్లా రాప్తాడు లో సిద్ధం సభ జరగనుంది. అయితే ఈ సభకు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను మళ్ళించడం విమర్శలకు కారణమవుతోంది. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాప్తాడు సభకు 3000 బస్సులను కేటాయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి సొంత బస్సులు, అద్దె బస్సులతో కలిపి పదివేలు ఉండగా.. అందులో 3000 బస్సులను ఒకేసారి మళ్లించడం పై ఆర్టీసీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాయలసీమ నుంచి 2500 బస్సులు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 500 బస్సులు తరలించారు. 450 కిలోమీటర్ల దూరంలో నుంచి బస్సులను కేటాయించడం విశేషం. మొత్తం ఈ బస్సుల తరలింపు ఖర్చు పది కోట్ల రూపాయలు కాగా.. వైసిపి కేవలం 7 కోట్లు చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఒకేసారి ఇన్ని బస్సులు కేటాయించడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా స్తంభించింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అసలే వివాహాల సీజన్ కావడంతో ఇబ్బందులు తప్పలేదు. ప్రయాణికులు ఆర్టీసీ కాంప్లెక్స్ లు, బస్టాండ్లలో గంటల తరబడి వేచిఉన్నారు. అయినా బస్సుల జాడ లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. విద్యార్థులకు సైతం అసౌకర్యం తప్పలేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి ఆర్టీసీ జేబు సంస్థగా మారింది అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2022లో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించిన ప్లీనరీకి ఏకంగా 1857 బస్సులను కేటాయించారు. గత నెల 27న భీమిలి సమీపంలో జరిగిన సిద్ధం సభకు ఏకంగా 850 బస్సులను తరలించారు. ఈనెల 3న దెందులూరు సభకు 1357 బస్సులను కేటాయించారు. ఇప్పుడు ఏకంగా 3000 బస్సులను తరలించకపోవడం విమర్శలకు కారణం అవుతోంది.దీనిపై అన్ని వర్గాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.