Hero Nani: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన ‘హిట్ 3′(Hit : The Third Case) మూవీ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ‘సరిపోదా శనివారం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న నాని, ఈ ఏడాది ప్రారంభం లో ‘కోర్ట్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. హీరో గా ‘దసరా’, ‘హాయ్ నాన్న’ ఆ తర్వాత ‘సరిపోదా శనివారం’ విజయాలతో హ్యాట్రిక్ ని అందుకున్న నాని, ఈ ఏడాది నిర్మాతగా రెండు హిట్స్ ని అందుకున్నాడు. గత రెండు మూడేళ్ళ నుండి ఆయనకు గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ‘హిట్ 3’ విడుదలకు ముందు ఆయన చేసిన ప్రొమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: ‘హిట్ 3’ గురించి రామ్ చరణ్ సెన్సేషనల్ కామెంట్స్..హీరో నాని కౌంటర్ వైరల్!
ఆయన మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో ఇంకా కారు కొనుగోలు చేయలేదు. ఒకరోజు సరదాగా నా స్నేహితుడి కారుని తీసుకొని జాతీయ రహదారి మీద డ్రైవ్ కి వెళ్ళాను. అలా వేగంగా వెళ్తూ ఉండగా, ఆగి ఉన్న లారీ ని చూసుకోకుండా గుద్దేశాను. ముందు పక్క అడ్డం పగిలి నా శరీరం మొత్తం రక్తం తో నిండిపోయింది. నా స్నేహితుడు స్పృహ కోల్పోయాడు. లారీ వెనుక భాగం మొత్తం కారులోకి వచ్చేసింది. ఎలాగోలా కారు నుండి బయటపడి, అంబులెన్స్ లో వెళ్తూ ఉన్నాము. మేము అందులో వెళ్తున్న మార్గమధ్యం లో మరో ప్రమాదం జరిగింది. పాపం ఎవరో పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తూ ఉన్నారు. గాయపడిన వాళ్ళందరిని మేము వెళ్తున్న అంబులెన్స్ లోనే ఎక్కించారు. అందులో ఒక చిన్న పసి బిడ్డ కూడా ఉంది’.
‘ఆ బిడ్డకి అయిన గాయాలను మా గాయాలను మేము మర్చిపోయాము. ఆ చిన్నారిని ICU లోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. మాకు జరిగిన గాయాల గురించి మర్చిపోయి, ఆ చిన్నారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆరోజు రాత్రంతా ఆ రూమ్ బయటే వేచి ఉన్నాను. ఆ రాత్రి నాకు ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా అనిపించింది. ఆ ఒక్క రాత్రి నా జీవితాన్ని మార్చేసింది. జీవితాన్ని చూసే విధానం అక్కడి నుండే నేర్చుకున్నాను. మన జీవితం మన చేతుల్లో లేదు, ఏ క్షణంలో అయినా పైకి వెళ్లిపోవచ్చు, ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ప్రతీ క్షణాన్ని సంతోషంగా జీవించాలి అనేది అప్పుడే నాకు తెలిసొచ్చింది’ అంటూ నాని మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారాయి. ఆయన మాటలు ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిల్చింది.