Hero Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు నందమూరి కళ్యాణ్ రామ్. తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాడు కళ్యాణ్ రామ్. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ.. కెరీర్లో దూసుకెళ్లిపోతున్నారు కళ్యాణ్. ప్రస్తుతం నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా “బింబిసార” సినిమాలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… అనేది ఉపశీర్షిక. ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరోగా కళ్యాణ్ రామ్ కి ఇది 18వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పుడు తొలిసారి ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్ ఈ ఏడాది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమాను మొదలుపెట్టారు. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కొత్త దర్శకుడు రాజేంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారట. ఇప్పటివరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ… మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు కళ్యాణ్ రామ్. కాగా ప్రస్తుతం ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో ఇప్పుడు త్రిపాత్రాభినయం చేయడానికి రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. ఈ మూవీతో పాటు ‘డెవిల్’ అనే మరో సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు.