MAA Elections 2021: మా ఎన్నికల చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు సినీ ప్రముఖుల పరువు తీసేలా తయారవుతున్నాయి. ఇన్నాళ్లు కలిసి సినిమాల్లో నటించిన నటీనటులు ఈ ఎన్నికల పుణ్యమాని ఒకరినొకరు తిట్టుకుంటూ ట్రోల్స్ మీమ్స్ చేసుకుంటూ.. ఒకరి లొసుగులు మరొకరు బయటపెట్టి బజారుకీడ్చుకుంటున్నారు.
తాజాగా ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ తరుఫున నిలబడ్డ నటి హేమపై కొందరు మార్ఫింగ్ ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో అసభ్యంగా దుష్ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఆమె ఇలా చేసిన ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేశ్, నటి కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు లేఖ రాశారు.
నరేశ్, కరాటే కళ్యాణ్ ఇద్దరూ తన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలతో ఒక వీడియోను విడుదల చేశారని.. నటీనటుల ఫొటోలు మార్ఫింగ్ చేసి వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి కొన్ని యూట్యూబ్ చానెళ్లలో పోస్ట్ చేశారని హేమ ఆరోపిస్తున్నారు. సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశానని తెలిపారు. నరేశ్ వైఖరి తనను అగౌరవ పరిచేలా , నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉందని హేమ ఆరోపించారు.
ఎన్నికలు ముగిశాక ఇలా కొట్టాడుకుంటున్న నటులు మళ్లీ కలుస్తారు. అప్పుడు ఎలా పలకరించుకుంటారో తెలియదు.. సంస్థ ప్రతిష్ట దిగజార్చుతూ ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. వీరి వల్ల సంస్థకు చెడ్డ పేరు రావడమే కాకుండా టాలీవుడ్ పరువు కూడా పోతోంది. ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటేనే కానీ ఈ టాలీవుడ్ ప్రముఖులు మారేలా కనిపించడం లేదు.