పసుపులేటి కన్నాంబ..(Pasupuleti Kannamba) తొలితరం కథా నాయక, ఆ తర్వాత కాలంలో ప్రధాన సహాయ నటి. సహజంగా చరిత్ర ఆసక్తిగా ఉంటుంది, కానీ కొందరి చరిత్ర విషాదంతో కన్నీళ్ల మయమైపోయి ఉంటుంది. కన్నాంబ(Pasupuleti Kannamba) గారి జీవితం కూడా చాలా మలుపులు తిరిగింది. ఆ మలుపుల లోతులను చూసి కలత చెందే కంటే.. వెండితెర పై ఆమె మెరుపులను తలుచుకోవడం ప్రేరణ కలిగిస్తోంది.
కన్నాంబ(Pasupuleti Kannamba)తో నటన అంటే మహామహులే జాగ్రత్తపడేవారు. అసలు తెలుగు సినిమాకి నటనంటే ఏమిటో.. డైలాగ్ డెలివరీ అంటే ఏమిటో చెప్పిన మొట్టమొదటి సినిమా తార. సినిమాల్లో కన్నాంబ ఏమి నేర్చుకోలేదు, కన్నాంబే సినిమాలకు ఎంతో నేర్పింది. అప్పట్లో తమిళ, తెలుగు భాషల రెండింటిలోనూ సూపర్ స్టార్ గా వెలుగొందిన నిజమైన స్టార్ ఆమె. మొదటి తరం సూపర్ స్టార్ నాగయ్య గారితో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటి కూడా కన్నాంబ గారే.
అందుకే, తెలుగు కళామతల్లి కన్న తొలి ఆడపడుచు కన్నాంబ. ఆమె గురించి ఇప్పటి తరానికి తెలియదు, కానీ తొలి మహానటి కన్నాంబ గారే అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఆమె నటన ఓ చరిత్ర, ఆమె నటించిన పాత్రలు ఆణిముత్యాలు. కన్నాంబ గారు కెరీర్ అదృష్టం మీద నడవలేదు, కట్టుబాటు తెగింపుల సాహసాల మీద నడిచింది.
ఆడవాళ్లు బయటకు వస్తేనే ఎన్నో అపవాదులు మోపే కాలంలో.. ఏకంగా మగాళ్లకు పోటీగా నాటకాల్లో నటించి ఎన్నో అవమానాలు పొందిన సినిమాల మహాతల్లి కన్నాంబ. నంద్యాలలో అక్టోబర్ 5 – 1911న ఆమె జన్మించారు. చిన్న తనం నుంచి నటనపై ఆసక్తి, దానికి తోడు కుటుంబ పరిస్థితుల కారణంగా నాటకాలు వేశారు.
అలా నాటకాల్లో రాటుతేలిన కన్నాంబ గారు, 12 ఏళ్ళకే మద్రాసు చేరుకున్నారు. 13 ఏళ్ళ వయసు నుంచే నటిస్తూ సావిత్రి, అనసూయ, చంద్రమతి పాత్రలకు ప్రాణం పోశారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు. స్పాట్ లో రికార్డింగ్ చేయాలి. ఇక మైక్ లు, లైట్ లు, మేకప్ లు ఇవేమి లేవు. పైగా భారీ డైలాగ్ లు, పాటలు, అన్నిటికీ మించి పద్యాలు.. ఇలా అన్నీ సొంతంగానే పాడుకోవాలి.
అలా పాడుతూనే హావభావాల పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇలా చేయడం ఈ తరం నటీమణులకు అసాధ్యం. అందుకే కన్నాంబ.. తెలుగు కళామతల్లి కన్న తొలి ఆడపడుచు.
