Naga shaurya-Anusha Shetty: నాగ శౌర్య పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 20 ఉదయం 11:25 నిమిషాలకు పెళ్లి ముహూర్తం. అనుష్క శెట్టి మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడవనున్నాడు. నాగ శౌర్య-అనూష వివాహానికి బెంగుళూరు వేదిక అయ్యింది. అక్కడ రెండు రోజులు వివాహం వేడుకలు జరగనున్నాయి. శనివారం మెహందీ వేడుక నిర్వహించారు. నూతన వధూవరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కొత్త జంట చూడముచ్చటగా ఉన్నారు.

నాగ శౌర్య వివాహానికి అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానం ఉన్నట్లు సమాచారం. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి వేడుక జరగనుంది. టాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొనే సూచనలు కనిపించడం లేదు. కాగా కన్నడ అమ్మాయి అయిన అనూష శెట్టి యంగ్ ఎంట్రప్రెన్యూర్. ఆమె ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నడుపుతున్నారు. ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టి ఈ విభాగంలో పలు అవార్డ్స్ అందుకున్నట్లు సమాచారం.
నాగ శౌర్య-అనూషలది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే విషయంలో స్పష్టత లేదు. కన్నడ అమ్మాయితో మనోడికి జోడీ ఎలా కుదిరిందనే సందేహాలు మొదలవుతున్నాయి. పెళ్లికి వారం సమయం కూడా లేదనగా నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యాడు. ఆయన షూటింగ్ సెట్స్ లో సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు నుండే నాగ శౌర్య జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిసింది.

అనారోగ్యంతో పాటు ఏమీ తినకుండా షూట్ లో పాల్గొనడంతో ఇలా జరిగింది. దాదాపు రెండు రోజులు నాగ శౌర్య ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కాగా నాగ శౌర్య ఒక సాలిడ్ హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు. పాపం కసితో సినిమాలు చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన లక్ష్య మూవీపై నాగ శౌర్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయినా అతని కోరిక తీరలేదు. లక్ష్య విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన హీరోగా మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నట్లు సమాచారం.