Indian Racing League Hyderabad: నరకాసురుడి తో యుద్ధం జరుగుతున్నప్పుడు… శ్రీకృష్ణుడు సొమ్మసిల్లి పడిపోతాడు.. అలాంటి సమయంలో ఓ చేత్తో రథాన్ని, మరో చేత్తో యుద్ధాన్ని చేస్తూ సత్యభామ నరకాసురున్ని సంహరిస్తుంది. ఎంతటి కష్ట కాలంలో అయినా అతివలు తమ ధైర్యాన్ని కోల్పోరు.. తెగువను ప్రదర్శిస్తూనే ఉంటారు. అలాంటి అతివలకి కూసింత ప్రోత్సాహం ఇస్తే చెలరేగి పోతారు. పురాణ కాలంలో మాదిరి ఇప్పుడు కృష్ణుడు, నరకాసురులు లేరు. కానీ యుద్ధంలాంటి రేసింగ్ ఉంది.. దూసుకొచ్చే ప్రత్యర్థులు ఉన్నారు. వీటి మధ్య వాహనాన్ని ఒడుపుగా నడుపుతూ రయ్యిన దూసుకు పోతున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్ లో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మెరిసిపోతున్నారు.. వారిలో కొంతమంది హై రేసర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లోలా లవిన్స్ ఫోస్
సాధారణంగా 17 సంవత్సరాల వయసులో ఆలోచనలు ఎలా ఉంటాయి? కాలేజీకి వెళ్ళాలి. స్నేహితులతో కలిసి గడపాలి. వారాంతాల్లో కుటుంబంతో ఎంజాయ్ చేయాలి. కానీ లోలా లవిన్స్ ఫోస్ అలాంటి రకం కాదు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో అనే టైపు.. ఈ రేసులో హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. వయసు చిన్నదే అని తక్కువ అంచనా వేయకండి.. ఈ వయసుకే ప్రపంచ మహిళా రేసర్ల జాబితాలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మోటార్ స్పోర్ట్స్ లో ఎంతోమంది మెరికలను అందించిన ఫ్రాన్స్ లో పుట్టిన ఈ అమ్మాయి.. తొమ్మిదేళ్లకే రేసింగ్ మొదలుపెట్టింది. 13 సంవత్సరాలకే అద్భుతాలు సృష్టించింది. ఫ్రెంచ్ ఏఐఎంఈ సిరీస్, ఫ్రాన్స్ ఛాంపియన్షిప్, స్పానిష్ ఎఫ్ 4 వంటి ప్రతిష్టాత్మక ట్రోఫీలతో సహా 13 విజయాలు సొంతం చేసుకుంది. 30 రేసుల్లో పాల్గొన్న అనుభవం ఈమెకు ఉంది. ఇటలీతో సహా ప్రపంచంలోని అన్ని ట్రాక్ ల పైనా డ్రైవ్ చేసింది. తండ్రి ఫార్ములా డ్రైవర్ కావడంతో తను కూడా ఈ క్రీడపై మమకారాన్ని పెంచుకుంది. తన లాంటి టీనేజర్ల మాదిరి జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనే బాధ ఉన్నా ప్రపంచం మొత్తం చుట్టి వస్తున్నా అనే సంతోషం ఉందని అంటోంది లోలా లవిన్స్ ఫోస్.. రేసులు లేకపోతే మామూలు అమ్మాయిలానే కళాశాలకు వెళ్లి చదువుకుంటాను అని చెబుతోంది.

సెలియా మార్టిన్
పది సంవత్సరాల వయసుకే ఈ అమ్మాయికి రేసులపై ఆసక్తి కలిగింది.. తన ఆసక్తిని నాన్నతో పంచుకుంది.. 2014లో మొదటిసారి పోటీలో పాల్గొన్నది.. ఉద్యోగం చేస్తూనే ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ రేసింగ్ టీం నడిపింది. ఆర్థికంగా స్థిరపడ్డాక జర్మనీ వెళ్ళింది.. జాగ్వార్, ల్యాండ్ రోవర్ సంస్థలకు, న్యూ బోర్గ్ రింగ్ టెస్టింగ్ సెంటర్ కు రేస్ టాక్సీ పైలెట్ గా చేసింది. ప్రొఫెషనల్ రేసర్ మాత్రమే కాదు… ఇన్స్ట్రక్టర్ ఫార్ములా_1 రేసులకు హోస్ట్ కూడా.. 2018 నుంచి రేసింగ్ ను కెరియర్ గా మార్చుకుంది. ఇప్పటివరకు 24 పోటీల్లో పాల్గొంది.. వాల్స్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎఫ్ ఐ ఏ రేస్ సిరీస్ _ ది జాగ్వర్ 1 ఫేస్ ఈ_ ట్రోఫీ, న్యూ బోర్గ్ రింగ్ 24 గంటల రేస్, గిరి టైర్ మోటార్స్ స్పోర్ట్స్ వంటివి ఈమె పాల్గొన్న రేసుల్లో ఉన్నాయి.

బియాంక బస్ట్ మాంటే
ఈమె స్వస్థలం ఫిలిప్పీన్స్. చిన్నప్పుడు నాన్నతో కలిసి రేసులకు వెళ్ళేది. ఆయనను చూసే రేసింగ్ పై ప్రేమ కలిగింది.. ఐదు సంవత్సరాల నుంచి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేది.. పాఠశాలకు వెళ్లే అవకాశం లేక ఇంట్లోనే ఉండి చదువుకున్నది. రేసులు, రేసింగ్ ట్రాకులే ప్రపంచంగా బతికింది. తోటి రేసర్లే స్నేహితులయ్యారు.. ఆగ్నేయాసియాలో మోటార్ స్పోర్ట్స్ ను ఎంచుకునే వారు చాలా తక్కువ.. దాన్ని మార్చి ఆసియన్ డ్రైవర్లు కూడా సత్తా చాటగలరని నిరూపించింది. 17 సంవత్సరాలు ఉన్న ఈ యువతి నాలుగు చైనా గ్రాండ్ ఫిక్స్ కార్ట్ స్కాలర్ షిప్ లు అందుకున్న మొదటి ఆసియన్. రెండుసార్లు ఫిలిప్పీన్స్ నేషనల్ సీనియర్ కార్టర్, మూడుసార్లు డ్రైవర్ ఆఫ్ ది ఇయర్… ఇలా బోలెడు విజయం సాధించింది.. ఇవే అంతర్జాతీయ రేసింగ్ ప్రోగ్రాం డబ్ల్యూ లో స్థానం కల్పించాయి..ఎఫ్1 రేసర్ కావాలి అనేది ఈమె కోరిక.
