ఆ కుర్రాడికి చిన్నతనం నుండే సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చి ఆ ఇష్టమే అతన్ని నేడు డైరెక్టర్ ను చేసింది. యంగ్ హీరో శ్రీవిష్ణు ( Sree Vishnu) హీరోగా క్యూట్ బ్యూటీ మేఘా ఆకాశ్, మరో తార సునైన హీరోయిన్లుగా ఈ శుక్రవారం రాబోతున్న సినిమా ‘రాజ రాజ చోర’ ( Raja Raja Chora) . టైటిల్ ను బట్టే తెలుస్తోంది దర్శకుడి అభిరుచి ఏమిటో.
అందుకే, బడ్జెట్ విషయంలో వంద ఆలోచించే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఈ సినిమా విషయంలో అసలు బడ్జెట్ పరిమితులే పెట్టుకోలేదు. మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఈ సినిమా కథ విని నిర్మాణంలో తాను భాగం కావాలని ఏరికోరి వచ్చారట. మరి ఇంతమంది ఈ సినిమాని నమ్మడానికి కారణం ఒక్కటే. దర్శకుడు హసిత్ గోలి (Hasith Goli).
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బాల్య స్నేహితుడు హసిత్ గోలి. సినిమాల్లోకి రాకముందు వీరిద్దరూ కలిసి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆ అనుభవంతోనే ‘మెంటల్ మది’ సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు వివేక్ ఆత్రేయ. తనకు డైరెక్టర్‌గా అవకాశం రాగానే, తన స్నేహితుడికి కూడా ఎంట్రీ ఇప్పించాడు. అయితే, వచ్చిన ఆ అవకాశాన్ని హసిత్ గోలి బాగా ఉపయోగించుకున్నాడు.
కాగా తన మొదటి సినిమా గురించి, తన సినీ కెరీర్ గురించి హసిత్ గోలి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు సంఘటనలు చెప్పారు. అవేంటో హసిత్ గోలి మాటల్లోనే.. ‘మా నాన్నగారు గోలి హనుమత్ శాస్త్రి కారణంగా నాకూ చిన్న తనం నుండే సాహిత్యం పై ఇష్టం పెరిగింది. ఆ ఇష్టం అభిరుచిగా మారింది. అందుకే, సినిమాల పై కూడా ఇష్టం పెరిగింది.
‘బ్రోచెవారెవరురా’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ అనుభవంతోనే ‘రాజ రాజ చోర’ సినిమాకి పని చేశాను. శ్రీవిష్ణులో మంచి కామెడీ యాంగిల్ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో నా సినిమాలో చూపిస్తున్నాను. మంచి కథ, సినిమా బాగా వచ్చింది’ అంటూ ఈ కుర్ర డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.