తెలంగాణ రాజకీయ చరిత్రలో గుమ్మడి నర్సన్నకి ఓ ప్రత్యేక స్థానముంది. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆయన, 25 ఏండ్లు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పనిచేసినా మచ్చ లేని రాజకీయ నాయకుడిగా కీర్తి సాధించిన మహా వ్యక్తి ఆయన. కాగా మహానేతగా జీవించిన గుమ్మడి నర్సన్న ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. పైగా నేటి తరానికి కూడా రాజకీయ ప్రొఫెసర్ గా తన జీవిన శైలితో నిత్యం స్ఫూర్తి నింపుతున్నారు గుమ్మడి నర్సన్న.
ఒక సాధారణ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా ఈ అడవి బిడ్డ ఎదిగిన తీరు అద్భుతం, పైగా రూపాయ ఖర్చు లేకుండా 5 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలవడం అంటే.. అది చరిత్రే. అన్నిటికి మించి ఆయన గెలిచిన తీరు.. భావితరాలకు గొప్ప స్ఫూర్తి. కొండల, గుట్టల్లో వెలుగుల కోసం తను కొవ్వొత్తిలా కరిగిన ఆయన నైజం ఎప్పటికీ నిజమైన సేవకు ప్రతిరూపం.
అయితే ఆయన గుండె చాటున దాగిన ఎన్నో బాధలను, జీవితంలో ఆయన పడిన కష్టాలను, ఆయన చేసిన ఎనలేని ఎన్నో త్యాగాల లోతులను, ఆయన ప్రజా జీవిత విజయాలను.. ఇలాంటి మరెన్నో అంశాల కళబోతలో వెండితెర వేదికగా ప్రజాక్షేత్రంలోకి నర్సన్న జీవితాన్ని సినిమాగా తీసుకురాబోతున్నారు. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్ తో ఈ సినిమాను డైరెక్టర్ పరమేశ్వర్ మరియు అతని టీమ్ మన ముందుకు తీసుకొస్తున్నారు.
నిజాయితీకి మారు పేరైన ప్రజా నేత గుమ్మడి నర్సయ్య గారి జీవితాన్ని ఆధారంగా సినిమా రావడం గొప్ప విషయం. ఇలాంటి మహానేతను వెండితెర ద్వారా ప్రతి తెలుగువాడికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తోన్న ఈ సినిమా బృందానీకి ప్రత్యేక అభినందనలు. వాళ్ళ కృషి ఫలించాలని, నరసన్న ఆదర్శ జీవితం భావితరాలకు సంపూర్ణంగా అందివ్వాలని కోరుకుందాం.