
తెలంగాణ మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ సర్కార్ నుంచి ఈటలకు ఉద్వాసన పలికినట్టైంది. దీంతో ఇక టీఆర్ఎస్ కు ఈటలకు ఎలాంటి సంబంధం లేదు. ఈటలను పొమ్మనకుండానే భూకబ్జా ఆరోపణలతో నీట్ గా సాగనంపింది కేసీఆర్ సర్కార్. ఇక టీఆర్ఎస్ కు ఈటలకు సంబంధాలు పూర్తిగా తెరపడినట్లే..
ఈ క్రమంలోనే తొలి తెలంగాణ ఉద్యమకారుడైన ఈటలను చేర్చుకునేందుకు బీజేపీ సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. ఈటలకు తెలంగాణ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. వైఎస్ఆర్ హయాంలోనూ ప్రలోభాలకు లొంగకుండా పార్టీని నమ్ముకొని ధైర్యంగా నిలబడ్డ ఉద్యమకారుడిగా ఈటల పేరు పొందారు. పార్టీ కోసం అంతగా పాటుపడిన ఈటలకు ఇప్పుడు అవమానకర రీతిలో ఎగ్జిట్ లభించడం తెలంగాణ సమాజంలో చర్చనీయాంశమైంది. ఈటలపై సానుభూతి వ్యక్తమవుతోంది.
ఇప్పటికే టీఆర్ఎస్ వెలుగు వెలిగిన విజయశాంతిని బీజేపీ చేరదీసింది. ఆమెకు స్టార్ క్యాంపెయిన్ పదవి ఇచ్చి పెద్దపీట వేశారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో పెద్ద నాయకుడు అయిన ఈటలను కూడా చేర్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను కలిసేందుకు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బండి ఈ మేరకు ఈటలతో సంప్రదింపులు జరిపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్ గురించి బండి సంజయ్ కుమార్ తో ఈటెల రాజేందర్ చర్చించనున్నారు.
ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈటల కోసం రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఈ మేరకు ఈటలతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలిసింది. బీజేపీ నుంచి ఆఫర్ అందడంతో దీనిపై ఈటెల రాజేందర్ సన్నిహితులు కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
రాజకీయ సమీకరణాలు కుదిరితే ఈటల త్వరలోనే బిజెపి లోకి చేరే అవకాశం ఉంది. ఈ మేరకు బిజెపి హై కమాండ్ కూడా ఈటల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.