Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, అగ్రహీరో మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు (56) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నేటి సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు.
గత కొంతకాలంగా కాలేయ వ్యాధి సమస్యలతో బాధపడుతున్నారు. శనివారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు తెలిపారు. ఈ వార్త తెలియడంతో ఘట్టమనేని అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
రమేశ్ బాబు 2018లోనే అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో వైద్య చికిత్సలు పొంది కోలుకున్నారని తెలిసింది. అప్పటి నుంచి కాలేయానికి చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
ఇక సూపర్ కృష్ణ నటించిన సినిమాల్లో బాల నటుడిగా రమేశ్ బాబు ఎంట్రీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు మూవీలో కృష్ణ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించారు. అనంతరం సోలో హీరోగా ఎంట్రీ దాదాపు 15 సినిమాల్లో హీరోగా చేశాడు. ఆ తర్వాత పెద్దగా హిట్ కాకపోవడంతో సినీ ఇండస్ట్రీ నుంచి హీరోగా వైదొలిగారు.
అనంతరం నిర్మాతగానూ మారారు. మహేష్ నటించిన ‘అతిథి’, దూకుడు, ఆగడు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. మహేష్ బాు సినిమాలకు సహ నిర్మాతగానూ చేశారు.
ఇక ప్రస్తుతం రమేశ్ బాబు సోదరుడు అయిన మహేష్ బాబు కరోనా సోకి క్వారంటైన్ లో ఉన్నారు. రమేశ్ బాబు చనిపోవడంతో ఇప్పుడు ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.