AP Tourism: ఏపీలో( Andhra Pradesh) పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఎందుకుగాను భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆతిథ్య రంగంలో సైతం ఏపీని అభివృద్ధి చేయాలని చూస్తోంది. వచ్చే నెలలో 10 కొత్త హోటళ్ల కు శ్రీకారం చుట్టనుంది. తిరుపతి తో పాటు విశాఖలో హోమ్ స్టే విధానాన్ని అమలు చేస్తోంది. మరోవైపు ఎంటర్టైన్మెంట్ పార్కుల నిర్మాణం సైతం జరగనుంది. హోటళ్లతో పాటు ఆతిధ్యరంగం, టూరిజం పార్కులు ఏర్పాటుకు సంబంధించి.. దాదాపు 29 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కూడా పూర్తి చేయనుంది ఏపీ ప్రభుత్వం. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి పర్యాటక రంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తూ వస్తుంది. ఈసారి కూడా అదే ప్రయారిటీ కల్పించాలని భావిస్తోంది.
* కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలు..
ప్రస్తుతం అమరావతిలో( Amravati capital ) కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. కీలక ప్రతిపాదనలతో అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే నెలలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు ఒకేసారి కొత్త హోటళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే నాలుగేళ్లలో పర్యాటక విధానంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానంతో హోటల్స్ నిర్మించేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూములను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ స్థలాల వివరాలను వెబ్ సైట్ లో పెట్టి హోటల్ నిర్మాణం పై అనుభవం ఉన్న సంస్థలకు కేటాయించాలని సూచించారు.
* అందుబాటులోకి హోం స్టే విధానం..
రాష్ట్రవ్యాప్తంగా పేరు మోసిన నగరాల్లో హోమ్ స్టే( home stay) అందుబాటులోకి వచ్చింది. దీనికోసం ప్రత్యేక పోర్టల్ కూడా అందుబాటులో ఉంది. ఎవరైనా పర్యాటకులు వస్తే ఇంటి అనుభూతి కలిగేలా ఇళ్లను అందుబాటులోకి తేవడం హోం స్టే ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పటికే విశాఖ నగరం తో పాటు అరకు లాంటి ప్రాంతంలో ఈ విధానం అమల్లోకి తెచ్చారు. మిగతా ప్రాంతాల్లో విస్తరించేందుకు నిర్ణయించారు. ఇప్పుడు కలెక్టర్లకు ఈ విషయంలో కీలక సూచనలు చేశారు.
* విశాఖ పెట్టుబడుల సదస్సులో..
ఇటీవల విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు జరిగింది. ఇందులో పర్యాటక శాఖకు సంబంధించి 26 జిల్లాల్లో 29 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. ఇప్పటికే 7 పర్యాటక హబ్ లు, 25 సర్క్యూట్ లను ప్రకటించారు. తొలి దశలో కొండపల్లి, మంగళగిరి, కూచిపూడి, ఏటికొప్పాక వంటి ప్రాంతాల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రారంభించనున్నారు. అడ్వెంచర్ టూరిజం, హౌస్ బోట్లకు కూడా అనుమతులు ఇస్తున్నారు. విశాఖలో 50 ఎకరాల స్థలంలో వండర్ లా ఎంయూజ్మెంట్ పార్క్, తిరుపతిలో 20 ఎకరాల్లో ఈమాజిక వరల్డ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి.