కరోనా క్రైసిస్ తో సినిమా రంగం కుదేలైపోయింది. గత ఆరేడు నెలలుగా థియేటర్లు మూతపడగా.. షూటింగులు వాయిదా పడ్డాయి. ఇటీవల టాలీవుడ్లో షూటింగుల సందడి మొదలైంది. థియేటర్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గముఖం పట్టకపోవడంతో ప్రేక్షకులు మాత్రం థియేటర్లో సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అక్టోబర్ 15నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. 50శాతం అక్యుపెన్సీతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లను నడుపుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇలా థియేటర్లు నడిపితే తమకు నిర్వహాణ ఖర్చులు కూడా రావని థియేటర్ల యాజమాన్యాలు వాపోతున్నారు.
ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులంతా వాటికే అలవాటుపడిపోతున్నారు. దీంతో థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ప్రస్తుతం థియేటర్లు నడుస్తున్నా ఎక్కడా కూడా ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో నిర్వాహాకులు నష్టపోతున్నారు. అయితే డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో థియేటర్లు ఓపెన్ అయ్యేలా కన్పిస్తున్నాయి.
జనవరి నుంచి థియేటర్లలో కొత్త సినిమాల హడావుడి ఉండటంతో ఈలోపు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నాలను నిర్వాహకులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటీటీల్లో రిలీజ్ టాలీవుడ్ సినిమాలను థియేటర్లలో ఫ్రీగా ప్రదర్శించేందుకు నిర్వాహకులు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ఒకరిద్దరి కోసమే సినిమాలను ప్రదర్శిస్తుంది.
ఈక్రమంలోనే సినిమాలను కొన్నిరోజులపాటు థియేటర్లలో ఫ్రీగా నడిపిస్తే ప్రేక్షకులు క్రమంగా వస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓటీటీలో రిలీజైన నాని ‘వి’.. అనుష్క ‘నిశబ్ధం’.. కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ సినిమాలను థియేటర్లలో ఫ్రీగా నడిపించే ప్రయోగాన్ని నిర్వాహకులు చేస్తున్నారు. మరీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో వేచిచూడాల్సిందే..!