Akshay Kumar Fourth Flop: స్టారాదిస్టారులు ఉన్నా.. ఒళ్ళు దాచుకోని నటీమణులు ఉన్నా.. వందల కోట్లు ఖర్చుపెట్టి తీస్తున్నా.. ప్రేక్షకులు దేకడం లేదు. అంతటి అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి సినిమాలనూ “బాయ్ కాట్” చేస్తున్నారు. కానీ ఇంత జరుగుతున్నా బాలీవుడ్ మారుతోందా అంటే.. లేదు.. పైగా దక్షిణాదిలో చిన్న బడ్జెట్ తో నిర్మితమైన సినిమాలు వందల కోట్లను కొల్లగొట్టేస్తున్నాయి. కళ్ళముందు ఇంత కనిపిస్తున్నా బాలీవుడ్ దర్శకులకు సోయి రావడం లేదు. హీరోలకు అసలు జ్ఞానోదయం కలగడం లేదు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. బాలీవుడ్లో అక్షయ్ కుమార్.. మినిమం గ్యారెంటీ హీరో. కానీ ఈ మధ్య ఆయన నటించిన బచ్చన్ పాండే, రక్షాబంధన్, సామ్రాట్ పృథ్వీరాజ్ అడ్డంగా తన్నేశాయి. వీటిలో బచ్చన్ పాండే సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండకు రీమేక్. తెలుగులో కూడా గద్దల కొండ గణేష్ గా నిర్మితమై సూపర్ హిట్ అయింది. కానీ ఒరిజినల్ కథకు రకరకాల పైత్యాలు అద్దడంతో ప్లాప్ అయింది. ఇక తాజాగా అక్షయ్ కుమార్ నటించిన కట్ పుత్లీ డైరెక్ట్ గా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయింది. ఇది తమిళంలో సూపర్ హిట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ రాక్షసన్ సినిమాకు రీమేక్. కానీ ఒరిజినల్ లో ఉన్న సోల్ ని పట్టుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఫలితంగా కట్ పుత్లీ కి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఒక రకంగా అక్షయ్ కుమార్ కు ఇది నాలుగో షాక్.

..
తమిళంలో రాక్షసన్, తెలుగులో రాక్షసుడు సినిమాలు వచ్చి మూడు, నాలుగేళ్లు దాటుతున్నా ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారీ మంచి రేటింగ్ సాధిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమాను తోపు అనొచ్చు. అంతటి సినిమాను రీమేక్ చేయాలంటే దర్శకుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. కానీ హిందీ దర్శకుడు తన పైత్యాన్ని మొత్తం ఈ కథలో జొప్పించాడు. ఫలితంగా సినిమా అడ్డంగా తన్నేసింది. ముందు థియేటర్ కోసం ఈ సినిమాని ప్లాన్ చేసుకున్నారు. కానీ మతిపోయే రేంజ్ లో 180 కోట్ల డిజిటల్ ప్లస్ సాటిలైట్ డీల్ రావడంతో ఇంకేం ఆలోచించకుండా ఓటిటి డైరెక్ట్ ప్రీమియర్ కు చిత్ర నిర్మాతలు ఓకే చెప్పారు. అదెంత మంచి పని అయిందో ఈ చిత్ర నిర్మాతలకు ఇప్పుడిప్పుడే అవగతం అవుతోంది.
..
కట్ పుత్లికి ప్రేక్షకుల నుంచి ఆశించినత స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదని డిస్నీ అంటోంది. ఒరిజినల్ వెర్షన్ తో పోల్చిన వాళ్లు పెదవి విరుస్తుండగా, నేరుగా దీన్ని చూసిన వాళ్ళు సైతం ఇందులో అంతగా ఏముందని సోసో ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. వాస్తవానికి రాక్షసన్ సినిమాకి ప్రధాన బలం సైకో ఫ్లాష్ బ్యాక్. కానీ దానిని ఈ సినిమాలో కిచిడీ చేశారు. లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రను మార్చేశారు. స్కూల్ మాస్టర్ ఎపిసోడ్ ని కూడా కంగాలి కంగాలి చేశారు. అన్నింటికీ మించి సినిమాకు ప్రాణంగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఈ సినిమాలో కొనసాగించలేకపోయారు. జూలియస్ పకీయం ఇచ్చిన బీజీఎం సో సో గా ఉంది. ఇన్ని రకాల మైనస్ లు ఉండటంతో కట్ పుత్లీ కి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమాతో వరుసగా నాలుగు ఫ్లాపులను అక్షయ్ కుమార్ మూటగట్టుకున్నాడు.

..
వాస్తవానికి రాక్షసన్ సినిమాలో ఒకటి రెండు మినహా పెద్దగా లోపాలు ఏమీ ఉండవు. అందుకే తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు మక్కికి మక్కి దించారు. ఫలితంగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఖాతాలో తొలి హిట్ గా నిలిచింది. ఇప్పటికీ తమిళ రాక్షసన్ సినిమాను క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తోపు అని సినిమా పండితులు చెబుతుంటారు. అంతటి మంచి సినిమా సోల్ మార్చకూడదనే ప్రాథమిక సూత్రాన్ని ఈ చిత్ర దర్శకుడు రంజిత్ ఎం తివారి పక్కన పెట్టారు. సొంత ప్రయోగం చేయడంతో దానికి తగ్గట్టుగానే ఫలితం కూడా తేడా కొట్టేసింది. సినిమా నిడివి తగ్గించినా కూడా ఫలితం లేకపోవడం విచారకరం. అయితే ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమ్ అయిన రోజే జీ5 ఉద్దేశపూర్వకంగా రాక్షసన్ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ని తన యాప్ లో రిలీజ్ చేయడం గమనార్హం. ఈ డబ్బింగ్ వర్షన్ కి ఎక్కువ వ్యూస్ రావడం ఇక్కడ మరో ట్విస్ట్. ఫైనల్ గా చెప్పేదేంటంటే ప్రేక్షకుడనేవాడు కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. ఎక్కడ కొత్తదనం లభిస్తే ఆ సినిమాను చూస్తున్నాడు. స్టారాదీ స్టారులు నటించినంత మాత్రానా నెట్టిన పెట్టుకుని ఊరేగడం లేదు.