Trisha: అడుసు తొక్కిన మాటలు మాట్లాడనేల.. క్షమాపణలు చెప్పనేల?

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏవీ రాజు అనే వ్యక్తి అన్నా డీఎంకే పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన త్రిషపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేయడంతో పలువురు సినీ నటులు, ఇతర రాజకీయ ప్రముఖులు మండిపడ్డారు.

Written By: Velishala Suresh, Updated On : February 22, 2024 8:24 am
Follow us on

Trisha: అప్పట్లో లియో సినిమా విడుదలైనప్పుడు.. ఆ సినిమాలో హృదయ్ రాజ్ డిసౌజా పాత్ర పోషించిన మన్సూర్ అలీ ఖాన్ గుర్తున్నాడు కదా.. విచిత్రమైన మాటతీరుతో ఆకట్టుకునే పాత్రతడిది. ఆ పాత్రకి తగ్గట్టుగా నటించిన అతడు.. నిజ జీవితంలో మాత్రం తేలిపోయాడు. మురికి కాలువ లాంటి నోటితో ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ త్రిషపై అడ్డగోలుగా మాట్లాడాడు. రాయడానికి వీలు లేని పనికిమాలిన భాషతో ఆమెను సంభోదించాడు. అతడు మాట్లాడిన మాటలకు తమిళ సినీ పరిశ్రమ నోచుకుంది. త్రిష దాదాపు ఏడ్చినంత పని చేసింది. త్రిషను ఆ మాటలు అన్న మన్సూర్ అలీ ఖాన్ ను చిత్ర యూనిట్ దాదాపు కొట్టినంత పని చేసింది. తమిళ చిత్ర పరిశ్రమ అతనిపై నిషేధం విధించింది. ఈ ఘటన మర్చిపోకముందే త్రిష మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. దురదృష్టవశాత్తు ఈసారి కూడా ఆమె బాధితురాలయ్యారు.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏవీ రాజు అనే వ్యక్తి అన్నా డీఎంకే పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన త్రిషపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేయడంతో పలువురు సినీ నటులు, ఇతర రాజకీయ ప్రముఖులు మండిపడ్డారు. దీంతో విషయం అర్థం చేసుకున్న అతడు స్పందించాడు. ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని.. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని.. ఆమెతోపాటు దర్శకుడు చరణ్, నటుడు కరుణాదాస్ కు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించాడు..

తమిళనాడులో ఏవి రాజుకు, ఎమ్మెల్యే వెంకటాచలానికి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏవీ రాజు.. వెంకటాచలాన్ని ఉద్దేశించి విమర్శలు చేశాడు. అయితే అనూహ్యంగా హీరో త్రిష కృష్ణన్ పేరు ప్రస్తావించాడు. అసలు ఆమె పేరు తీసుకురావడమే పెద్ద పొరపాటు అనుకుంటే.. ఆమె వ్యక్తిగత జీవితంపై దురుద్దేశపూర్వమైన వ్యాఖ్యలు చేశాడు. అతడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ విషయం త్రిష దాకా రావడంతో ఆమె అగ్గిమీద గుగ్గిలమైంది. “ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నీచమైన మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వారు ఏ స్థాయికైనా దిగజారుతారు. ఇలాంటి వ్యక్తులను మళ్లీమళ్లీ చూడటం మరింత ఘోరంగా ఉందని” త్రిష అప్పట్లో సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. తనకు ఓపిక నశించిందని.. ఇకపై అలాంటి వ్యక్తులను క్షమించబోనని.. తన వ్యక్తిత్వ హనానికి ఎవరు పాల్పడినా లీగల్ చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఏవీ రాజు త్రిష పై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హీరో విశాల్, పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు. ” ఈమధ్య ప్రతీ వాడు సినిమా వాళ్ళను విమర్శిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సినిమా వాళ్లు కూడా మనుషులే. వారికి కూడా కుటుంబాలు ఉంటాయి. ముఖానికి రంగులు వేసుకొని నటించినంత మాత్రాన వారికి ఆత్మాభిమానాలు లేకుండా పోతాయి అనుకోవడం అవివేకం” అని విశాల్ వ్యాఖ్యానించాడు. కాగా, త్రిష ఇటీవల లియో సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అజిత్ సరసన “విదా మూయార్చి”, మోహన్ లాల్ సరసన “రామ్”, కమల్ హాసన్ తో థగ్ లైఫ్, చిరంజీవితో “విశ్వంభర” అనే సినిమాల్లో నటిస్తోంది.