Revanth Reddy : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి మళ్ళీ దూకుడు మొదలుపెట్టారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితిని ఆయన చెడుగుడు ఆడుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వ పాలకులు చేపట్టిన పలు విధానాలను పదేపదే ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పలు శ్వేత పత్రాలు కూడా ఆవిష్కరించారు. మేడిగడ్డను ఎమ్మెల్యేల బృందంతో సందర్శించారు. సమయం దొరికితే చాలు లెక్కలతో సహా చెబుతూ కెసిఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి తన కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లారు. బుధవారం కోస్గి ప్రాంతంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో 4,369 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మార్చి 15న రైతు భరోసా అమలు చేస్తామని వెల్లడించారు. రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటానని రేవంత్ ప్రకటించారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్ అన్నారు. నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వపరంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే.. గత ప్రభుత్వ పనితీరును రేవంత్ రెడ్డి విమర్శించారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణలో జలదోపిడీ ఎక్కువ జరిగిందని విమర్శించారు. పాలమూరులో ఎంపీగా గెలిచిన చంద్రశేఖర రావు ఏం చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కెసిఆర్ ఏపీకి కృష్ణా జలాల తరలింపుకు సహకరించారని ఆరోపించారు. పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఓటు అడగాలని కెసిఆర్ కు రేవంత్ సూచించారు. 2014 నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాకు వచ్చి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని హామీ ఇచ్చారని.. దానిని నేటికీ అమలు చేయలేదని రేవంత్ ధ్వజమెత్తారు.
కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీని సైతం రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీకి నలుగురు పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని.. ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి తీసుకురాలేకపోయారని రేవంత్ ఎద్దేవా చేశారు . త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి 14 ఎంపీ సీట్లు గెలవాలని రేవంత్ కార్యకర్తలకు సూచించారు. పాలమూరు జిల్లా నుంచి వంశీచంద్ రెడ్డిని పాలమూరు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించాలని రేవంత్ కోరారు. కాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ అదే ఫైర్ తో మాట్లాడటంతో కోస్గి ప్రజలు ఈలలు వేస్తూ ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ప్రభుత్వపరంగా తన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రేవంత్ ఈ సందర్భంగా ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు.