
వెంకటేష్ కొత్త సినిమా ‘నారప్ప’ను మొదట మే 14వ తేదీ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో అది సాధ్యపడలేదు. అంతలో ఓటీటీ నుండి మంచి ఆఫర్ రావడంతో ఈ సినిమాను ఈ నెల 20వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయం పై బయ్యర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులి ఎస్.థాను ‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ పై వివరణ ఇచ్చారు. ఇప్పుడు అందరూ నారప్ప చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి కారణం ఏంటని సోషల్ మీడియాలో అలాగే మా చుట్టూ ఉన్న సినిమా జనం అడుగుతూ ఉన్నారు. అలాగే ఓటీటీ రిలీజ్ ను కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఇది ప్లాన్ చేసి చేసింది కాదు.
మీకు తెలియదు, నేను నాసినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయడానికే ఆసక్తి చూపిస్తాను. అందుకే నారప్ప చిత్రాన్ని మే 14న థియేటర్లలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాము. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో మీకు తెలుసు. కాబట్టి కరోనా పరిస్థితుల్లో ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తే సేఫ్ అవుతామన్న నమ్మకం లేదు.
నేను నారప్ప సినిమా కంటే ముందు తమిళంలో నిర్మించిన కర్నన్ చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేసాను. కానీ కరోనా కారణంగా ఆ సినిమా ఆడలేదు. సుమారు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు నష్టపోవడం జరిగింది. బిజినెస్ దృష్టిలో పెట్టుకునే నారప్ప సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది’ అంటూ కలైపులి ఎస్.థాను చెప్పుకొచ్చారు.