Allu Arjun: హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో ఒక వివాహిత కన్నుమూసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అల్లు అర్జున్ ని ఏ11గా పొందుపరిచినట్లు సమాచారం. డిసెంబర్ 12వ తేదీ ఉదయం, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆరోగ్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.
హైకోర్టులో అల్లు అర్జున్ న్యాయవాదులు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పటికే అల్లు అర్జున్ ని చంచల్ గూడా జైలుకి తరలించారు. బెయిల్ పేపర్స్ సకాలంలో జైలు అధికారులకు అందలేదు. దాంతో నియమాల ప్రకారం అల్లు అర్జున్ గత రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది.
నేడు ఉదయం అల్లు అర్జున్ విడుదలకు సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. ఆరున్నర గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ జైలు నుండి బయటకు వచ్చాడు. కాగా అల్లు అర్జున్ నేరుగా తన ఇంటికి కాకుండా మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. చంచల్ గూడ జైలుకు సమీపంలో చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు ఉంది. అలాగే భార్య పిల్లలు అక్కడే ఉన్నారట. అందుకే మొదట వాళ్ళను కలిసేందుకు వెళ్ళాడు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి అల్లు అర్జున్ చేరుకున్నారు.
అల్లు అర్జున్ నివాసం వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బారికేడ్స్ పెట్టారు. అల్లు అర్జున్ ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకే పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.