
ఆ రోజుల్లో పెద్ద దర్శకుడు అనగానే.. హీరోలు సైతం భయపడేవారు. ముఖ్యంగా దర్శకుడు మధుసూదనరావు గురించి చెప్పాలి. ఆయన సెట్ లో ఉన్నారంటే ప్రతి ఒక్కరికీ హడలే. ఆయనకు కోపం వస్తే ఎవర్నీ వదలకుండా తిట్టడం ఆయన నైజం. అలా ఆయన చేతిలో తిట్లు తిన్న వారిలో స్టార్లు కూడా ఉన్నారట. అలనాటి అందాల హీరో శోభన్‌బాబును కూడా మధుసూదనరావు చాలాసార్లు తిట్టారట.
కానీ, తనకు ఎంత స్టార్ డమ్ ఉన్నా.. శోభన్ బాబు ఎన్నడూ మధుసూదనరావు పై సీరియస్ అవ్వలేదు. కారణం.. శోభన్ బాబు అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో మధుసూదనరావు చాల సహాయం చేశారట. కొన్ని సినిమాలు కూడా ఇప్పించారట. అందుకే శోభన్ బాబు, ఆయనను గురువుగా భావించేవారు. అయితే, ఓ రోజు స్టార్ హీరో అని కూడా చూడకుండా సెట్ లో అందరి ముందు తిట్టారు మధుసూదనరావుగారు.
ఆ రోజు మాత్రం శోభన్ బాబు చాల బాధ పడ్డాడు. ‘పెద్ద హీరోని నన్నే మీ దర్శకుడు అలా తిట్టాడేంటయ్యా’ అని అప్పటికీ అసోసియేట్ దర్శకుడిగా పని చేస్తోన్న రాఘవేంద్రరావుతో చెప్పుకుని బాధపడ్డారట శోభన్ బాబు. ఒక విధంగా శోభన్ బాబుకి – రాఘవేంద్రరావుకి మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కూడా అదే కారణం. ఆ చనువు కారణంగా రాఘవేంద్రరావుకి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చారు శోభన్ బాబు.
అయితే ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత మధుసూదనరావు జీవితంలో జరిగింది. తిరుగులేని దర్శకుడిగా ఉన్న ఆయన.. వరుస పరాజయాలతో అవకాశాలు లేక చాల ఇబ్బంది పడ్డారు. ఓ దశలో నిర్మాతలు ఆయనను పట్టించుకోవడం కూడా మానేశారు. మిగిలిన అప్పటి ప్రముఖ నటీనటులు కూడా మధుసూదనరావును దూరం పెట్టారు.
కారణం.. గతంలో ఆయన నోరు జారిన కారణమే. దాంతో మధుసూదనరావు ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ విషయం తెలిసిన శోభన్ బాబు, తానే సినిమా ఇప్పించి మధుసూదనరావుకి డేట్లు ఇచ్చాడు. తనను అవమానించినా అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తిత్వం శోభన్ బాబుది.