Dhurandhar 3 days gross: చాలా కాలం తర్వాత బాలీవుడ్ నుండి సరైన కంటెంట్ ఉన్న యాక్షన్ సినిమా ‘దురంధర్’|(Dhurandhar Movie) రూపం లో వచ్చింది. అక్కడి ఆడియన్స్ స్పై జానర్ సినిమాలను ఈమధ్య కాలం లో ఆదరించడం లేదు. ఎందుకంటే కొత్తదనం లేదు, అన్నీ ఒకే తరహా సినిమాలే వస్తున్నాయి. రీసెంట్ గా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి నటించిన ‘వార్ 2’ చిత్రాన్ని ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ ని చేశారో మనమంతా చూసాము. ఇక స్పై జానర్ సినిమాలకు కాలం చెల్లినట్టే అని అనుకుంటున్న సమయం లో విడుదలైన ‘దురంధర్’ చిత్రం స్పై జానర్ చిత్రాలకు సరికొత్త ఊపిరి పోసింది. విడుదలకు ముందు ఈ చిత్రం నిడివి 3 గంటల 30 నిమిషాలకు పైగా ఉండడం తో, అంత సేపు థియేటర్ లో కూర్చొని ఎవరు ఈ సినిమాని చూస్తారు అంటూ విమర్శలు వచ్చాయి.
కానీ సినిమా చూసిన తర్వాత ఇంకా కొంచెం సేపు సినిమా ఉండుంటే బాగుండేది అని ఆడియన్స్ కి అనిపించింది. ఒక యాక్షన్ చిత్రానికి ఇలాంటి అనుభూతి కలగడం చాలా అరుదు. డైరెక్టర్ ఆదిత్య టేకింగ్, రణవీర్ సింగ్ మరియు ఇతర నటీనటల నటన అంత అద్భుతంగా ఉంది మరీ. ఇకపోతే ఈ సినిమాకు మొదటి మూడు రోజులు వచ్చిన వసూళ్లను చూస్తే, రాబోయే రోజుల్లో ఈ చిత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటుందేమో అని అనిపిస్తోంది. మొదటి రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 28 కోట్ల 60 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ రోజు 33 కోట్ల 10 లక్షల రూపాయిలు, మూడవ రోజు 44 కోట్ల 80 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 106 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఇక గ్రాస్ విషయానికి వస్తే ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 125 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ రాగా, ఓవర్సీస్ లో 34 కోట్ల 48 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 160 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంతటి నిడివి ఉన్న ఒక సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రావడం నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. నేడు వర్కింగ్ డే, అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 21 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. దీని అర్థం ఇప్పట్లో ఈ సినిమా రన్ ఆగదు అని. ఇదే రేంజ్ ఊపుని కొనసాగిస్తూ ముందుకు పోతే కచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.