Eenadu content theft: తెలుగు మీడియా( Telugu media) రంగంలో ఈనాడుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రింట్ మీడియాలో అయినా.. ఎలక్ట్రానిక్ మీడియాలో అయినా.. డిజిటల్ మీడియాలో అయినా ఆ సంస్థదే అగ్ర స్థానం. అయితే మారుతున్న డిజిటల్ రంగానికి అనుగుణంగా అనేక మీడియా ప్లాట్ఫార్మ్ లు తెరపైకి వచ్చాయి. కానీ వేగంగా దూసుకెళ్తున్న క్రమంలో తడబడుతున్నాయి. కానీ ఈనాడు అలా కాదు. ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుకొని.. నికార్సైన సమాచారంతో.. ప్రజలకు ఉపయోగపడే వార్తలతో గుర్తింపు పొందుతోంది ఈనాడు. ఇదే ఈనాడును వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి తమ సాక్షితో అధిగమించే ప్రయత్నం చేసినా అది వీలు కాలేదు. అంతలా తెలుగు వారితో పెనవేసుకుపోయింది ఈనాడు బంధం.
ఈనాడులో అనేక మార్పులు..
మీడియా రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈనాడు( Eenadu) అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వెబ్ ఎడిషన్ తో పాటు డిజిటల్ మీడియాలో సైతం అడుగుపెట్టింది. అయితే రాష్ట్రంలో ఏ మీడియాకు లేనంత నెట్వర్క్ ఈనాడుది. అయితే డిజిటల్ మీడియా విస్తరించింది. సోషల్ మీడియా విస్తృతం అవుతోంది. ఈ తరుణంలో వార్తా సేకరణ కోసం ఎక్కువగా ఈనాడుపై ఆధారపడుతున్నారు సోషల్ మీడియా శ్రేణులు. అయితే ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని ఉద్దేశంతో ఈనాడును ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఈనాడు కంటెంట్ ను ఎక్కువ మంది దుర్వినియోగం చేస్తున్నారు. తద్వారా ఈనాడు సంస్థకు నష్టం జరుగుతోంది. ఈ తరుణంలో మేల్కొంది ఈనాడు యాజమాన్యం. ఏకంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసింది. కొన్ని రకాల వాట్సాప్ గ్రూప్ మీడియాలను బాధ్యులను చేస్తూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
మీడియా విస్తృతం..
తెలుగు నాట మీడియా విస్తృతం అయింది. ఫలానా జర్నలిస్ట్ ఫలానా పత్రికలో.. ఫలానా టీవీలో పనిచేస్తున్నారు అని చెప్పడం కష్టతరంగా మారింది. జర్నలిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న తరుణంలో చాలామంది సొంతంగానే డిజిటల్ మీడియాలోకి అడుగు పెడుతున్నారు. తమకంటూ సొంతంగా డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ అభిప్రాయాలను, విశ్లేషణలు చేస్తున్నారు. వారి విషయంలో తప్పు పట్టలేము కానీ.. చాలామంది అక్షర జ్ఞానం లేని వారు సైతం మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నారు. అటువంటి వారు పేరు మోసిన మీడియాలో వస్తున్న కథనాలను, కంటెంట్ ను తమ సొంతానికి వాడుకుంటున్నారు. తమ ఎదుగుదల కోసం పేరు మోసిన మీడియా ఛానల్ లో వచ్చిన కథనాలు, వార్తలను యధాతధంగా ప్రచురిస్తున్నారు. వారి తీరుతో విస్తృత నెట్వర్క్ ఉన్న ఈనాడు లాంటి మీడియా సంస్థకు నష్టం జరుగుతుంది. అందుకే ఈనాడు మీడియా ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. తన వెబ్సైట్ తో పాటు ఈ పేపర్ వరకు ఒకే కానీ.. డిజిటల్ మీడియాలో వచ్చిన కథనాలను, వార్తలను యధాతధంగా ప్రచురించి.. తాము లాభ పొందుతూ.. ఈనాడును నష్టపరుస్తున్నారు అన్నది యాజమాన్యం గుర్తించిన అంశం. అందుకే పోలీసులను ఆశ్రయించింది యాజమాన్యం. కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరింది అందులో భాగంగా. అయితే ఈ అంశాన్ని అనుకూలురు ఒకలా.. వ్యతిరేకులు మరోలా ప్రాజెక్ట్ చేసే పనిలో పడ్డారు. అంతకుమించి ఏమీ లేదు కూడా.