Sonu Sood: తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విలన్ రోల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సోనూసూద్, కరోనా సమయంలో ప్రజల కోసం ఆయన చేసిన సేవాకార్యక్రమాలు ఎలాంటివో, దేశం మొత్తం ఆయన పేరు ఎలా మారుమోగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన సొంత డబ్బులతో పాటు, చారిటీ ద్వారా వచ్చిన డబ్బులతో ఎన్నో సేవలు అందించాడు. ఆ సమయం లో రాజకీయ నాయకుల పేర్ల కంటే ఎక్కువగా సోనూసూద్ పేరు వినిపించింది. ఆయన చేసిన సేవ వెనుక ఎదో లాభం ఉందని పలువురు విమర్శించినా సోనూ సూద్ పట్టించుకోలేదు. తన మనసుకి తోచిన పనిని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే సినిమాల్లో విలన్ గా పిలవబడే సోను సూద్, నిజ జీవితం లో మాత్రం రియల్ హీరో అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా లో నెటిజెన్స్ కీర్తించారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడు సోనుసూద్ కి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే లూథియానా కి చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి 10 లక్షల రూపాయిలు ఇవ్వాలని, కానీ ఇవ్వకుండా మోసం చేసాడని, అందుకు సాక్షి సోను సూద్ అని కోర్టు లో పిటీషన్ వేసాడు. కోర్టు విచారణ కోసం సోను సూద్ ని పలుసార్లు హాజరు కావాలని ఉత్తర్వులు ఇవ్వగా, సోను సూద్ ఇప్పటి వరకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన లూథియానా కోర్టు ఓషివారా పోలీస్ స్టేషన్ కి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ రమణ్ ప్రీత్ కౌర్ సోను సూద్ ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కి హాజరు పర్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు. దీనికి సోను సూద్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రీసెంట్ గానే సోను సూద్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసి తమ చారిటీ సంస్థ ద్వారా నాలుగు అంబులెన్సులను ఉచితంగా డొనేట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా లో సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిసింది. సోను సూద్ ఇప్పటికీ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు,శబాష్ అంటూ ఆయన్ని పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఇంతలోపే ఈ వార్త రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే, ఒకప్పుడు విలన్ గా ఫుల్ బిజీ కెరీర్ ని చూసిన సోను సూద్, ఇప్పుడు హీరోగా సక్సెస్ ని చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన ‘ఫతేహి’ అనే చిత్రం ద్వారా హీరోగా బాలీవుడ్ ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఈ చిత్రం కమర్షియల్ గా యావేరేజ్ రేంజ్ లో ఆడింది. ఈ సినిమాలో ఆయన హీరో గా నటించడమే కాకుండా, దర్శకత్వం వహించడం విశేషం.