Chiranjeevi and Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరు కలిస్తే సందడే. వారిద్దరు కలవడం అరుదుగానే జరుగుతుంది. అలాంటి వేదిక ప్రస్తుతం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఎప్పుడో వివాహ వేడుకలు, సినిమా ఫంక్షన్లకు తప్ప ఇద్దరు కలవడం సాధారణంగా జరగదు. కానీ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పెళ్లి వేడుక దీనికి వేదికైంది. ఇద్దరు కలిసి సందడి చేయడం అందరిని సంతోషపరచింది. మెగా బ్రదర్స్ కలయికపై సామాజిక మాధ్యమాలు సైతం హోరెత్తాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై నిలవడంతో అందరు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కొడుకు వెంకట్రావు పెళ్లి విందు కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ హాజరయ్యారు. దీంతో నిర్వాహకులు సంబరపడ్డారు. ఇద్దరిని కలిసి ఫొటోలు దిగేందుకు పలువురు పోటీ పడ్డారు. పవన్ కల్యాణ్ భుజంపై చిరంజీవి చేయి వేసి నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
మెగా బ్రదర్స్ ఒకచోట కలవడంతో మెగా అభిమానుల్లో హర్షం వ్యక్తమైంది. మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ సభ్యులతో ఇద్దరు సరదాగా ఫొటోలు దిగారు. అందరితో కలివిడిగా మాట్లాడారు. ఆప్యాయంగా పలకరిస్తూ సందడి చేశారు. అభిమానుల కోలాహలం మధ్య ఇద్దరు తారలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

చిరంజీవి ఆచార్యలో నటిస్తూ గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తరువాత బాబీ దర్శక్తత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ సైతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. బీమ్లా నాయక్, హరిహర వీరమల్లుతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా చురుకుగా ప్రచారం చేస్తున్నారు.