Maoist party: ములుగు జిల్లా టేకులగూడ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ అసలు నిజంగా ఎన్‌కౌంటర్ కాదా? పోలీసులే మావోయిస్టులను పట్టుకుని చంపి తర్వాత ఎన్‌కౌంటర్‌గా నమ్మబలుకుతున్నారా?అని అంటే మావోయిస్టు పార్టీ ప్రకటన చూసాక అవుననే సమాధానం వస్తోంది. ఎప్పుడు ఎన్‌కౌంటర్ జరిగినా పోలీసులేమో ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైరింగ్ అంటారు. మావోయిస్టులేమో బూటకపు ఎన్‌కౌంటర్ అంటారు. వారికి వంతపాడుతూ పౌరహక్కుల సంఘం వారూ బూటకపు ఎన్‌కౌంటరేనని చెబుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అక్కడేం జరిగిందనేది తెలుసుకోవడం కష్టమే.
అయితే ములుగు జిల్లా టేకులగూడ అటవీ ప్రాంతంలో జరిగింది పూర్తిగా బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐ మావోయిస్టుపార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేశారు. పోలీసులకు, మావోయిస్టులకు ఇద్దరికీ ఇన్‌ఫార్మర్లు ఉంటారు. గిరిజనులు మావోయిస్టు పార్టీకి ఇన్‌ఫార్మర్లుగా, కొరియర్లుగా పని చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడం వల్ల ఎన్‌కౌంటర్ జరిగిందని జగన్ లేఖలో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా ఎన్‌కౌంటర్ అనేది పోలీసులు కాషన్ ఇచ్చాక స్టార్ట్ చేస్తారు. హెచ్చరికలు జారీ చేశాకే ఫైరింగ్ మొదలవుతుందన్నమాట. కానీ జగన్ లేఖ ప్రకారం పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.
అంతేకాక జగన్ సీఎం కేసీఆర్‌పైనా మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహిస్తోందని, ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక వైపు పేదల పక్షాన ఉన్నామంటానే పోడు పేరుతో ఆదివాసీలను ఇబ్బందులకు గురి చేస్తున్నది నిజం కాదా అని లేఖలో ప్రశ్నించారు. ఇటీవల గిరిజనుల పోడు వ్యవసాయం గురించి సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా ఆదివాసీలను ఇబ్బందులు పెడుతున్నారని జగన్ పేర్కొనడం గమనార్హం. తెలంగాణ అడవుల్లో నెత్తు రోడిస్తూనే మరోపక్క కల్ల బొల్లి మాటలతో ప్రజలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని జగన్ లేఖలో చెప్పారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో రీజనల్ సెంటర్ సీ ఆర్‌సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్స్ నరోటి దామాల్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ఏరియాకు చెందిన పూనెం భద్రు, బీజాపూర్ జిల్లాలోని పెద్దకోర్మ గ్రామానికి చెందిన సోడి రామాల్ అలియాస్ సంతోష్, బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకు చెందిన కామ్రేడ్లు మరణించినట్టు జగన్ లేఖ ద్వారా ప్రకటించారు.