Jani Master: సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం అనేక మంది ఎదురు చూస్తుంటారు. నటనపై ఆసక్తితో చాలా మంది రంగుల ప్రపంచంలోకి వెళ్లడానికి ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తుంటారు. ఇక నటీనటులు.. అవకాశాల కోసం నిర్మాతలు, దర్శకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అవకాశాల కోసం డబ్బులు పెడతారు.. ఇక మహిళలు అయితే కమిట్‌మెంట్‌కు కూడా సిద్ధమవుతారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా మందికి అవకాశాలు కమిట్‌మెంట్‌తోనే వస్తాయన్న ప్రచారమూ ఉంది. అయితే రంగుల ప్రపంచంలో అవకాశాలు ఉన్నప్పుడు కమిట్‌మెంట్లు, వేధింపులపై నోరు మెదపని మహిళా నటులు.. అవకాశాలు తగ్గాక ఆరోపణలు చేస్తున్నారన్న ప్రచారమూ ఉంది. అవకాశాల కోసం మొదట అంగీకరించి. తర్వాత ఆరోపణలు చేయడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. ఇండస్ట్రీలో వేధింపులపై సౌత్ ఇండస్ట్రీలో ఒకవైపు చర్చ జరుగుతుండగానే తాజాగ తెలుగు కొరియో గ్రాఫర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో ఇది చర్చనీయాంశమైంది.
జానీ మాస్టర్‌పై జూనియర్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు..
ప్రముఖ తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. మాస్టర్ తనను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడని మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఔట్‌డోర్ షూటింగ్ సమయంతోపాటు, తన ఇంటికి వచ్చి కూడా లైంగికంగా వేధించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు రాయద్గుం పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు. అక్కడ పోలీసులు భారత న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 376(రేప్), క్రిమినల్ బెదిరింపులు(506), గాయపర్చడం(323)లోని క్లాజ్(2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్..
జానీ మాస్టర్ ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. జానీ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశాడు. దీంతో ఇప్పుడు రేప్ ఘటన ఏపీలో పొలిటికల్ టర్న్ కూడా తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరి ఈ కేసుపై జానీ మాస్టర్ స్పందించలేదు. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.