Akshay Kumar: కరోన మహమ్మారి కారణంగా 2020 మార్చిలో కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినీ ఇండస్ట్రికి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పాలి. ఈ ప్రభావం అన్నీ ఇండస్ట్రిల పైన బలంగా పడింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గి గత ఏడాది చివర్లో థియేటర్లు పున: ప్రారంభం అయ్యాక పలు ఇండస్ట్రీలు కోలుకున్నాయి. కానీ బాలీవుడ్ పరిస్థితి మాత్రం మారలేదనే చెప్పాలి. సెకండ్ వేవ్‌కు ముందు ఏవో కొన్ని సినిమాలు నామ మాత్రంగా రిలీజయ్యాయి కానీ బాక్సాఫీస్‌లో సందడి చేయలేకపోయాయి.

సెకండ్ వేవ్ తర్వాత కూడా మహారాష్ట్రలో థియేటర్లు మూతబడే ఉండటం వల్ల మరో భారీ నష్టంగా మారింది. నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల కూడా థియేటర్లు తెరవకపోవడం మరో మైనస్. గత రెండు నెలల్లో బాలీవుడ్ లో రిలీజైన సినిమా లేవీ కలెక్షన్లను రాబట్టలేక పోయాయి. అక్షయ్ కుమార్ నటించిన ‘బెల్ బాటమ్’ కు దారుణమైన ఫలితం రావడం బాలీవుడ్ ఫిలిం మేకర్స్‌ను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ఐతే అక్టోబరు 23న మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోవడంతో పరిస్థితులు మారతాయని అందరూ భావిస్తున్నారు.
ఇటీవల దీపావళి కానుకగా అక్షయ్ కుమార్ “సూర్యవంశీ” ని భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా మంచి ఫలితాన్నే అందుకునేట్లు కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కూడా బాగా కలిసొచ్చింది. తొలి రోజు ఈ చిత్రం ఇండియాలో రూ.23 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. ‘బెల్ బాటమ్’ ఫుల్ రన్లో దాదాపు ఇంతే వసూళ్లు రాబట్టడం గమనార్హం. వీకెండ్ అయ్యేసరికి ఇండియాలో రూ.60-70 కోట్ల మధ్య గ్రాస్ రావచ్చు అని అంచనా వేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ కు ఈ సినిమాతో మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు.