Devara: ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు హిట్ అవ్వడం బాక్స్ ఆఫీస్ కి తప్పనిసరిగా మారిపోయింది. ‘కల్కి’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దాదాపుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఘోరంగా నిరాశపర్చాయి. నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ఆయ్’ , ‘మత్తువదలరా 2’ వంటి చిన్న చిత్రాలు సూపర్ హిట్స్ గా నిల్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే ఇవన్నీ సరిపోవు, బాక్స్ ఆఫీస్ వద్ద థియేటర్స్ కనీసం నెల రోజులు జనాలతో కళకళలాడాలంటే కచ్చితంగా ‘దేవర’ లాంటి చిత్రాలు రావాల్సిందే.
అందుకే ట్రేడ్ ఈ చిత్రం మీద భారీ ఆశలు పెట్టుకుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 1.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక చేదు వార్త ఇప్పుడు అభిమానులను నిరాశకు గురి చేసింది. ఎన్టీఆర్ నుండి అభిమానులు యాక్షన్ తో పాటుగా, అదిరిపోయే డ్యాన్స్ కూడా కోరుకుంటారు. ప్రతీ సినిమాలో ఒక డ్యాన్స్ నెంబర్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే దేవర లో అలాంటి అవకాశం లేకుండా పోయింది. అభిమానుల కోసమే ప్రత్యేకంగా ‘దావూది’ సాంగ్ ని పెట్టించాడు కొరటాల శివ. ఈ పాట లిరికల్ వీడియో సాంగ్ ని కొంతకాలం క్రితమే విడుదల చేయగా, దీనికి అభిమానులు, ప్రేక్షకుల నుండి డివైడ్ టాక్ వచ్చింది. అంతే కాకుండా ఫైనల్ ఔట్పుట్ చూసుకున్న తర్వాత ఈ పాట ఎందుకో కథకు అడ్డంగా అనిపించిందట డైరెక్టర్ కొరటాల శివకి. దీంతో ఈ పాటను రోలింగ్ టైటిల్స్ లో పెడదామని అనుకున్నారు.
కానీ సినిమా మంచి హై మీద ముగియడం తో ఈ పాట కారణంగా అది డైల్యూట్ అయ్యే అవకాశం ఉండడంతో సినిమా నుండి మొత్తానికే తొలగించేసారు. ముందుగా ఈ సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలు ఉండేది. డైరెక్టర్ కి కొన్ని యాక్షన్ సన్నివేశాలు అనవసరం అనిపించడంతో వాటిని ఈ చిత్రం నుండి తప్పించారట. దీంతో ‘దేవర’ ఫైనల్ రన్ టైం 2 గంటల 45 నిమిషాలకు చేరిందట. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు తప్పించారు అనే వార్త రావడంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే సినిమా నిడివి వల్ల నెగటివ్ టాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతం లో పలు సినిమాలకు అలా జరిగింది కూడా. దీని వల్ల సినిమా మీద నెగటివ్ ప్రభావం పడేదానికంటే ముందుగానే రన్ టైం తగ్గించడం మంచిది అని ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.