https://oktelugu.com/

Electricity Charges: తెలంగాణ ప్రజలకు షాక్‌ ఇవ్వబోతున్న రేవంత్‌ సర్కార్‌.. విద్యుత్‌ చార్జీల పెంపునకు డిస్కంల ప్రతిపాదన.. సర్కార్‌ ఓకే అంటే బాదుడే!?

తెలంగాణలో ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యవయాల మధ్య ఉన్న లోటును వెల్లడించాయి. రెండు డిస్కంలకు కలిసి రూ.14,222 కోట్ల లోటు ఉందని అంచనా వేశాయి. ఈ మొత్తం లోటులో రూ.13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో సమకూర్చాలని కోరాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 19, 2024 / 03:26 PM IST

    Electricity Charges

    Follow us on

    Electricity Charges: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్‌ అమలు చేస్తోంది. రుణ మాఫీ చేసింది. దసరాకు రైతుభరోసా ఇచ్చే ఆలోచనలో ఉంది. అయితే తొలిసారి ప్రజలకు షాక్‌ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్‌ చార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    తెలంగాణలో విద్యుత్‌ చార్జీలు పెరుగుతాయా అంటే అవుననే అంటున్నాయి విద్యుత్‌ పంపిణీ సంస్థలు. తమకు ఇప్పటికే భారీగా లోటు ఉందని, ఈ నేపథ్యంలో చార్జీలు పెంచక తప్పదని పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో 1,200 కోట్లు పూడ్చుకోవడానికి చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. గృహ విద్యుత్‌ 300 యూనిట్లు దాటితే స్థిర చార్జీ కిలోవాట్‌కు రూ.40 పెంచాలని కోరాయి. 2024–25 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను విద్యుత్‌ నియంత్రణ మండలికి సమర్పించాయి. మొత్త మూడు కేటగిరీల్లో విద్యుత్‌ చార్జీలను సవరించాలని ప్రతిపాదించాయి.

    రూ.14 వేల కోట్ల లోటు..
    తెలంగాణలో ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యవయాల మధ్య ఉన్న లోటును వెల్లడించాయి. రెండు డిస్కంలకు కలిసి రూ.14,222 కోట్ల లోటు ఉందని అంచనా వేశాయి. ఈ మొత్తం లోటులో రూ.13,022 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో సమకూర్చాలని కోరాయి. అవి పోగా మిగిలిన రూ.1,200 కోట్లు
    చార్జీల పెంపుద్వారా పూడ్చుకోవాలని ప్రతిపాదించాయి. అయితే భారం పేద, మధ్య తరగి గృహ వినియోగదారులపై పడే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గృహ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటితే.. కిలోవాట్‌కు స్థిర చార్జీ రూ.10 వసూలు చేస్తున్నారు. అయితే ఆ మొత్తాన్ని మరో రూ.40 పెంచి రూ.50 వసూలుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ప్రతిపాదించాయి.

    సామాన్యులపై భారం లేకుండా..
    ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్‌ను అర్హులకు ఉచితంగా ఇస్తోంది. ఇక 299 యూనిట్ల విద్యుత్‌ వాడే మధ్య తరగతి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 300 యూనిట్లు దాటినవారిపైనే భారం వేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 300 యూనిట్లకుపైగా విద్యుత్‌ వినియోగించే గృహ వినియోగదారులు కేవలం 20 శాతమే. వారిపై మాత్రమే భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగతా 80 శాతం వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని డిస్కంలు చెబుతున్నాయి.

    బహిరంగ చర్చ తర్వాత..
    డిస్కంల ప్రతిపాదనపై రాష్ట్రంలో కనీసం మూడుచోట్ల బహిరంగ చర్చ చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చార్జీల సవరణ అమలులోకి వస్తుంది. ఈ మొత్త ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంది.