Bigg Boss : బుల్లితెర మీద ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో అత్యంత ప్రజాధారణ సంపాదించుకున్న షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ షో మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికి మన తెలుగు లో 7 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు 8 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ప్రతీ ఏడాది ఈ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉంటారు. వయస్సు తో సంబంధం లేకుండా ఒక బుల్లితెర షో కి ఇంత ఆదరణ రావడం బిగ్ బాస్ కి మాత్రమే జరిగింది. అయితే ఆడియన్స్ కి షో ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో, లోపల ఉండే కంటెస్టెంట్స్ కి అంతటి నరకం చూపిస్తుంది. జైలు లో కూడా కొన్ని సౌకర్యాలు ఉంటాయి, కానీ బిగ్ బాస్ లో ఉండదు.
టైం తెలియదు, ఫోన్ ఉండదు, టీవీ వగైరా వంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు, 24 గంటలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి. గొడవలు అవుతుంటాయి, అయినా కూడా వాళ్ళతోనే కలిసి తిరగాలి, మాట్లాడుకోవాలి..అన్నం సరిగా ఉండదు, టాస్కులు మాత్రం బీభత్సంగా ఉంటాయి, ఇలా బయట ప్రపంచం తో అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఉండాలి. కొంతమంది కంటెస్టెంట్స్ తట్టుకోలేక హౌస్ నుండి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. సంపూర్ణేష్ బాబు, గంగవ్వ, నోయల్ మరియు రీసెంట్ సీజన్ లో శేఖర్ బాషా, ఇలా వీళ్లంతా బిగ్ బాస్ వాతావరణం లో ఇమడలేక మధ్యలోనే వెళ్లిపోయిన వాళ్ళు. వీరు కాకుండా ప్రముఖ కమెడియన్ ధనరాజ్ కూడా ఇలా బిగ్ బాస్ వాతావరణం లో ఇమడలేక పారిపోవాలని అనుకున్నాడట. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన బిగ్ బాస్ విశేషాలను పంచుకున్నాడు. ఈయన సీజన్ 1 లో ఒక కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు.
ధనరాజ్ మాట్లాడుతూ ‘బిగ్ బాస్ హౌస్ లో నన్ను నవదీప్ చాలా చెడగొట్టేసాడు. ఒకరోజు సరదాగా మాట్లాడుకుంటూ, బిగ్ బాస్ లో వాతావరణం నచ్చకపోతే వెళ్లిపోవచ్చా అని అడిగాను. నచ్చకపోతే వెళ్లిపోవడమే అని నవదీప్ అన్నాడు. అలా ఒక రోజు స్మోకింగ్ రూమ్ పక్కన బట్టలు ఆరేస్తున్న సమయం లో నేను పక్కనే ఉన్న గోడను ఎక్కేసాను. ఎందుకు గోడ ఎక్కావు అని నవదీప్ అడిగాడు. నేను వెళ్ళిపోతున్నాను, నా వల్ల కాదు ఇక్కడ ఉండడం అని అన్నాను. అప్పుడు నవదీప్ అగ్రిమెంట్ చదవలేదా?, మనకి మనంగా హౌస్ నుండి వెళ్ళిపోతే పాతిక లక్షల రూపాయిలు బిగ్ బాస్ టీం వారికి చెల్లించాల్సి ఉంటుంది అని గుర్తు చేసాడు. దాంతో వెంటనే నేను గోడకు ఇటు వైపు గా దూకేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు ధనరాజ్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.