Bigg Boss 8 Finale : ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, వైల్డ్ ఫైర్ అయ్యి, బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ గా నిల్చిన గౌతమ్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఎందుకంటే గత సీజన్ లో 13 వారాలు కొనసాగి బయటకి వచ్చిన తర్వాత గౌతమ్ తనపై వచ్చిన అశ్వథామ ట్రోల్స్ ని చూసి చాలా బాధపడ్డాడు. అంత ట్రోల్స్ ని చూసిన తర్వాత, మళ్ళీ ధైర్యంగా ఇంకో సీజన్ లోకి రావాడం, అది కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ గా రావడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఇతను హౌస్ లోకి అడుగుపెట్టిన రెండవ వారంలో నామినేషన్స్ లోకి వచ్చాడు. నామినేషన్స్ లోకి వచ్చిన వెంటనే ఎలిమినేట్ అయిపోయాడు. కానీ మణికంఠ సెల్ఫ్ ఏవిక్షన్ కారణంగా గౌతమ్ సేవ్ అయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే గౌతమ్ కి బిగ్ బోస్ రియాలిటీ షో లో రెండు సార్లు కాదు, మూడు సార్లు అవకాశం వచ్చింది.
అలా వచ్చిన మూడవ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్న తీరు నిజంగా అద్భుతం అనే చెప్పాలి. తన ఆట తీరుని పూర్తిగా మార్చుకొని, కేవలం గేమ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి, తనకంటూ ఒక స్టైల్, స్వాగ్ ని ఏర్పాటు చేసుకొని, టాస్కులు అద్భుతంగా ఆడుతూ, తన దమ్ము చూపిస్తూ టైటిల్ విన్ అయ్యేది నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ని ఇచ్చాడు. తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన ఒక కంటెస్టెంట్ ఈ రేంజ్ ప్రభావం చూపడం ఇప్పటి వరకు జరగలేదు, భవిష్యత్తులో ఈ రికార్డు ని ఎవ్వరూ అందుకోలేరు కూడా. అలాంటి సెన్సేషన్ సృష్టించాడు. ఒకవేళ గౌతమ్ మొదటి వారం నుండి ఈ సీజన్ లో ఉండుంటే కచ్చితంగా ఆయన టైటిల్ గెలిచేవాడేమో.
ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిల్చిన నిఖిల్, తదుపరి సీజన్ లో వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చి, గౌతమ్ రేంజ్ లో టాప్ 2 లోకి రావడం అసాధ్యం. అది కేవలం ఒక్క గౌతమ్ కి మాత్రమే సాధ్యపడింది, ఈ రికార్డుని బ్రేక్ చెయ్యాలంటే మళ్ళీ గౌతమే చెయ్యాలి. అధికారిక ఓటింగ్ లో కూడా నిఖిల్ కి గౌతమ్ కి మధ్య తేడా కేవలం 0.03 శాతమేనట. ఆన్లైన్ ఓటింగ్ నిఖిల్ కి ఎక్కువ రాగా, మిస్సెడ్ కాల్స్ అత్యధికంగా గౌతమ్ కి వచ్చాయి. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. నిఖిల్ కి పాత కంటెస్టెంట్స్ కి సంబంధించిన అభిమానుల ఓటింగ్ బాగా ప్లస్ అయ్యింది. కానీ గౌతమ్ కి అది లేదు. తాను సృష్టించుకున్న సొంత బ్రాండ్ మీదనే ఇంత దూరం వచ్చాడు. టెక్నికల్ గా గౌతమ్ రన్నర్ అయ్యుండొచ్చు, కానీ అభిమానుల దృష్టిలో ఆయన విన్నెర్. గౌతమ్ లాంటి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ ని మళ్ళీ ఏ సీజన్ లో కూడా చూడలేం.