నందమూరి బాలయ్య సినీ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని ఎప్పటినుండో ఆశ పడుతూ ఎదురుచూస్తున్నారు బాలయ్య అభిమానులు. కానీ, మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని ఆ తరువాత వార్తలు వచ్చాయి. ఎప్పుడో 2017లోనే తన కొడుకు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని బాలయ్య చెబుతూ మురిసిపోయాడు. గత ఏడాది మోక్షజ్ఞ లుక్స్ చూసి నందమూరి అభిమానులు కూడా ఫీల్ అయ్యారు.
అయితే, హీరో అయ్యే దిశగా మోక్షు ఎలాంటి కసరత్తులు చేయడం లేదని స్పష్టం అయింది. కానీ తన షష్టిపూర్తి సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య, మోక్షజ్ఞను హీరోగా లాంచ్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ మామూలే. ఇప్పుడు బాలయ్య 61వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి బాలయ్య మీడియాతో మాట్లాడుతూ కొడుకు ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు.
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్ అంటూ, పైగా మోక్షజ్ఞ తెరంగేట్రం చేయబోతున్న సినిమాని తనే డైరెక్ట్ చేయబొతున్నట్లు బాలయ్య చెప్పడం విశేషం. బాలయ్య డైరెక్షన్, పైగా మోక్షజ్ఞ హీరో, ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ? ఐతే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో మాత్రం బాలయ్య క్లారిటీగా లేకపోవడం ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం.
నిజానికి ‘ఆదిత్య 369’ సీక్వెల్ ను ‘ఆదిత్య 999’ పేరుతో తెరకెక్కించాలని దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చాల నెలలు కష్టపడ్డారు. పైగా సింగీతం స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి చేశారు. కానీ బాలయ్య పైత్యం దెబ్బకు సింగీతంకు ఆ సీక్వెల్ ను డైరెక్ట్ చేయడం పెద్ద కష్టం అయిపోయింది. ఇక ఇప్పుడు ఆరోగ్య కారణాల దృష్ట్యా సింగీతం డైరెక్ట్ చేసే పరిస్థితిలో లేరని సమాచారం.
అన్నట్టు గత మూడు నెలలు నుండి తన ఫిజిక్ పై మోక్షజ్ఞ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ప్రస్తుత మోక్షజ్ఞ లుక్ మాత్రం అదిరిపోయేలా ఉందని, పూర్తి స్లిమ్ గా మారిపోయాడని తెలుస్తోంది. ఇదే నిజం అయితే నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతారు. గత నాలుగేళ్లుగా మా యంగ్ హీరో ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అంటూ కాలక్షేపం చేసిన బాలయ్య అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే అంశమే.