
నందమూరి బాలకృష్ణకు ఆయన తండ్రి ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమా నందమూరి తారకరామారావు’ అంటే ఎనలేని అభిమానం. అందుకే ఎన్టీఆర్ ను ఎవరు తలచుకున్నా బాలయ్య పొంగిపోతారు. ఇక ఏకంగా ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురిస్తే.. బాలయ్య ఆనందానికి అవధులు ఏమి ఉంటాయి. అందుకే బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన ఆనందాని వ్యక్తం చేస్తూ.. ‘కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ మా నాన్నగారు నందమూరి తారక రామారావు. కాగా భవిష్యత్తు తరాలకి స్ఫూర్తినిచ్చేలా ఆయన గురించి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని తన ఫేస్ బుక్ ఎంకౌట్ లో పోస్ట్ చేశారు.
Also Read: నాని ‘వి’ మూవీ రివ్యూ
ఇంతకీ కేసీఆర్ ఉన్నట్లు ఉండి ఎన్టీఆర్ జీవితాన్ని 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చడానికి ఓ కారణం ఉందట. కేసీఆర్ రాజకీయ జీవితానికి పునాది వేసింది ఎన్టీఆరే అని, పైగా కేసీఆర్ స్వతహాగా సీనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అని.. ఆ అభిమానంతోనే కేసీఆర్, తన కుమారుడి పేరు కూడా తారక రామారావు అని ఎన్టీఆర్ పేరే పెట్టుకున్నారని.. అంతటి అభిమానం ఉంది గనుకనే ఎన్టీఆర్ జీవితాన్ని ఇలా పాఠంగా మలిచారని తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించిన వెంటనే కేసీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం పని చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. మొత్తానికి తానూ సీఎం అయ్యాక ఎన్టీఆర్ మీద అభిమానాన్ని ఈ విధంగా ప్రదర్శించారు కేసీఆర్.